కేటీఆర్‌… ఇంకా అహంకారం తగ్గలేదా?

somireddy-chandra-mohan-reddy

ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆంధ్రా పాలకులను, జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండేవారు. కానీ వారితో వైసీపి నేతలు అంటకాగుతున్న కారణం చేత వారికి ధీటుగా జవాబు చెప్పలేకపోయేవారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కేసీఆర్‌ తదితరులు ఆయన గురించి చులకనగా మాట్లాడేవారు. కానీ వారితో వాగ్వాదాలు మనకెందుకని స్పందించేవారు కారు.

ఏపీలో రెండు ప్రధాన పార్టీలు తమకు జవాబు చెప్పకపోవడం బిఆర్ఎస్ నేతలకు చాలా అలుసుగా అనిపించి, అవకాశం చిక్కినప్పుడల్లా నోరు జారుతూనే ఉన్నారు. అయితే తొలిసారిగా టిడిపి కూడా కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది.

ADVERTISEMENT

టిడిపి ఎమ్మెల్సీ, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా చాలా ఘాటుగా స్పందించారు. ఈసారి ఏమాత్రం మొహమాటపడకుండా కేటీఆర్‌ని ఉద్దేశ్యించి “@BRSparty పాలనలో తండ్రి ఫామ్ హౌస్‌కు, కొడుకు కలెక్షన్ హౌస్‌కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు.

మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి. @KTR” అని ట్వీట్‌ చేశారు.

కేసీఆర్‌, కేటీఆర్‌ని ఉద్దేశ్యించి టిడిపి ఇంత ఘాటుగా స్పందించడం ఇదే తొలిసారి అని భావించవచ్చు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్‌ కాస్త కటువుగా ఉన్నా ఆయన పేర్కొన్నవన్నీ వాస్తవాలే అని అందరికీ తెలుసు. ఎదుటవారి మౌనాన్ని చాటకానితనంగా భావిస్తూ ఇంతకాలం బిఆర్ఎస్ నేతలు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఈ జవాబుతోనైనా కనువిప్పు కలిగితే మంచిదే. కలగకపోతే వారి అహంకారమే వారి పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories