ఇటీవల జగన్ చేసిన ఢిల్లీ పర్యటన సమ్మర్లో హాట్ హాట్ రాజకీయాలకు తెరలేపింది. ఇరుపక్షాల నుండి రాజకీయ విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ దినపత్రిక బయటపెట్టిన జగన్ లేఖ మరింత వేడిని రాజేసింది. ఆ లేఖ ఇప్పుడు రాసింది కాదు, ఓ మూడు నెలల క్రితం రాసినది అని వైసీపీ వర్గం సమర్ధించుకుంటుండగా, గతంలో కూడా ఈ లేఖ ఇచ్చినట్లు ఎందుకు చెప్పలేదని టిడిపి వర్గాలు కౌంటర్లు వేస్తున్నాయి. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ అంశంపై స్పందించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ తీరుపై ఘాటుగా స్పందించారు. సీబీఐ, ఈడీ ధాటికి ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో కాపురం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారని, రాష్ట్రపతినే కలిసిన జగన్, ప్రధానితో భేటీ అయితే తాము ఎందుకు ఇబ్బంది పడతామని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రధానిని కలిశామని చెప్పి, రాజకీయాలు మాట్లాడిన వైసీపీ తీరు “కాపురం చేయలేం గానీ, శోభనానికి ఓకే” అన్నట్లుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే జగన్ ఎన్ని లేఖలు ఇచ్చినా, విజ్ఞప్తులు చేసినా ఫలితం ఉండబోదని అన్నారు.
అవినీతి పరుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చండశాసనుడని, ఆయన వద్ద జగన్ ఆటలు సాగవని అన్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత కనీసం ముప్పై రాత్రుళ్లయినా జగన్ ఏపీలో నిద్ర చేశారా? అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి పట్టించుకుంటారనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదని జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. ఢిల్లీ వెళ్లి మోడీకి మద్దతు తెలిపిన అదే జగన్, తాజాగా ఏపీ అసెంబ్లీలో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందే సమయంలో విరుద్ధంగా వ్యవహరించడం పట్ల బిజెపి నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఏపీ శాసనసభలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడాన్ని తప్పుపట్టిన విష్ణుకుమార్ రాజు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల తీరును ఖండించారు. సభ బయట జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలుపుతామంటారు.., సభ లోపల బిల్లుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు… ఏంటీ ఈ విధానం? అంటూ ప్రశ్నించారు. ఈ తీరు మార్చుకోవాలని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచనలు చేసారు. రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అయితే ఇవే నినాదాల నడుమ ఏపీ అసెంబ్లీ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది.



