సోము వీర్రాజుకి కంఠశోష తప్ప ప్రయోజనం ఉందా?

Somu Veerraju comments on jagan govt about no development in apఇదివరకు తెలంగాణలో బిజెపి ఎటువంటి అయోమయం ఎదుర్కొందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ బిజెపి పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదివరకు తెలంగాణ బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌, ఆయన ప్రభుత్వ అవినీతిపై నిత్యం విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుండేవారు. కానీ టిఆర్ఎస్‌ స్పందించేది కాదు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు సిఎం కేసీఆర్‌తో చాలా సన్నిహితంగా మెలిగేవారు.

గత మూడున్నరేళ్ళుగా ఏపీ బిజెపి నేతలు కూడా వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సహా వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. జగన్ అడిగిందే తడువు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్స్ లభిస్తాయి. నెలనెలా అప్పులు పుడుతుంటాయి. కేంద్రంతో సఖ్యత కొనసాగుతున్నందున రాష్ట్రంలో బిజెపి నేతల విమర్శలను వైసీపీ పట్టించుకోవడం లేదు. కనుక బిజెపి నేతల విమర్శలు కంఠశోషగానే మిగిలిపోతున్నాయని చెప్పవచ్చు.

ADVERTISEMENT

ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈరోజు విజయవాడలో బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి పట్ల సిఎం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఆసక్తి లేదు. అందుకే బల్క్ డ్రగ్ పార్క్, హార్డ్ వేర్ పార్క్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వైద్య కళాశాలలు రాష్ట్రానికి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెపుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా కాకినాడలో హార్డ్ వేర్ పార్క్ కోసం గత ప్రభుత్వం కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం ఇళ్ళ స్థలాలకు కేటాయించింది. జగన్ ప్రభుత్వానికి ఎంతసేపు సంక్షేమ పధకాలతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రాభివృద్ధిపై ఆసక్తిలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించనప్పుడు కేంద్రం మాత్రం ఏవిదంగా ఆంధ్రప్రదేశ్‌కు సహాయపడగలదు?” అని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే తన ‘సంక్షేమ వైఖరి’ని స్పష్టంగా చెప్పి అప్పులు చేసి అమలుచేస్తున్నారు. ఆయనను ప్రోత్సహిస్తున్నది తమ కేంద్ర ప్రభుత్వమే అని సోము వీర్రాజుకి తెలుసు. కనుక ఒకవేళ బిజెపికి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే, మొదట్లోనే సిఎం జగన్ను అడ్డుకొని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తిచేయమని ఒత్తిడి చేసి ఉండేది. అప్పులు చేయకుండా అడ్డుకొని ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం హామీ ఉండి మరీ అప్పులు ఇప్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కనుక సోము వీర్రాజు వైసీపీని, సిఎం జగన్మోహన్ రెడ్డిని నిందించడం కంటే తమ మోడీ ప్రభుత్వాన్ని, తమ అసమర్దతను ముందు నిందించుకోవలసి ఉంటుంది.

అయితే తెలంగాణలో కేసీఆర్‌-మోడీ దోస్తీ ముగిసి టిఆర్ఎస్‌, బిజెపిల మద్య యుద్ధం మొదలైనట్లే, ఏదో ఓ రోజు ఇక్కడ ఏపీలోను జగన్-మోడీ దోస్తీ కూడా ముగిసి వైసీపీ, బిజెపిల మద్య యుద్ధం మొదలవడం ఖాయం. తెలంగాణ ధనిక రాష్ట్రం కనుక కేంద్రం సహాయనిరాకరణ చేస్తున్నా తట్టుకోగలుగుతోంది. కానీ అప్పులే తప్ప ఆదాయం లేని జగన్ సర్కార్ అప్పుడు ఏవిదంగా తట్టుకోగలదు?

ADVERTISEMENT
Latest Stories