సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం మధ్యాహ్నం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ఇంత హటాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ఎందుకు నిర్వహించబోతున్నారో కారణం తెలుపలేదు.
“17వ లోక్‌సభలో 13వ సెషన్ మరియు రాజ్యసభ 261వ సెషన్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజులు నిర్వహించబోతున్నాము. ఈ అమృత కాలంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం,” అని మాత్రమే ట్వీట్ చేశారు.
రెండు రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఏడాది డిసెంబర్‌లోగా లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయని మాకు సమాచారం ఉంది,” అని అన్నారు.
సెప్టెంబర్ నెలాఖరులోగా లేదా అక్టోబర్ మొదటివారం తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. కనుక ఆలోగా ప్రధాని నరేంద్రమోడీ కూడా లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్దమవుతున్నారేమో?అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిపే విధానం అమలుచేయాలనుకొంటున్నామని ప్రధాని నరేంద్రమోడీ ఇదివరకు చాలాసార్లు అన్నారు. ఇదీగాక దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం వలన ఇప్పటి వరకు బిజెపికి తిరుగులేకుండా ఉంది. కానీ కాంగ్రెస్ క్రమంగా బలం పుంజుకొంటోంది. కాంగ్రెస్ మిత్రపక్షాలు కలిసి ఇండియా కూటమి సిద్దం చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ ప్రధానమంత్రి పదవి ఆశించడంలేదని సంచలన ప్రకటనతో ఇండియా కూటమిపై మరింత స్పష్టత వచ్చింది.
మరో పక్క సిఎం కేసీఆర్ కూడా బిజెపికి కంచుకోట వంటి మహారాష్ట్రలో బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ప్రత్యర్దులు బలపడక మునుపే ఎన్నికలకు వెళ్ళిన్నట్లయితే బిజెపి మళ్ళీ గెలిచి అధికారంలోకి రావచ్చనే ఉద్దేశ్యంతో లోక్‌సభ రద్దుకు సిద్దం అవుతున్నారేమో?లేక మరేదైనా బలమైన రాజకీయ కారణమే ఉండవచ్చు. త్వరలోనే అసలు విషయం తెలుస్తుంది.



