సినీ వేడుకలన్నీ ఎక్కువగా హైదరాబాద్ లో నిర్వహిస్తుంటారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏవో ఒకటి, అర మాత్రం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే మరో ఆడియో వేడుకను విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాలు ప్రధాన పాత్రలలో నటించిన ‘అభినేత్రి’ సినిమా ఆడియో వేడుకను విజయవాడలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ వేడుకకు ఏకంగా ‘అతిలోకసుందరి’ శ్రీదేవిని రప్పించడానికి రంగం సిద్ధమవుతోందని ‘ఇండస్ట్రీ హిట్’ అధినేత బిఎ రాజు చేసిన ట్వీట్ లో స్పష్టమైంది. ఒకరు ఆల్ టైం అందాల బొమ్మ కాగా, మరొకరు నాభి సౌందర్యంతో ప్రస్తుతం మూడు ఇండస్ట్రీలను పడేసిన పరువాల బొమ్మ. ఈ ఇద్దరు సౌందర్య రాశులను ఒకే వేడుక మీద వీక్షించి తరించే అవకాశం ఆగష్టు 15వ తేదీన విజయవాడలో కలగనుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈ సారి బెజవాడ జనాలు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో జరుపుకోనున్నారన్న మాట.



