ఇది చాలదూ… ప్రజలు మనసులో ఏముందో తెలుసుకొనేందుకు?

Srikakulam-Woman-Shocks-Dharmana-Prasada-Raoఆంధ్రాలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయ్యింది. ఆ విషయం ప్రజలకు రోజూ గుర్తు చేయడానికి ప్రభుత్వ భవనాలకు, టిడ్కో ఇళ్లకు, చివరికి కరెంటు స్తంభాలకు కూడా వైసీపీ రంగులు వేయించుకొంది. పధకాలన్నిటికీ జగనన్న పేర్లు పెట్టుకొంది.

ADVERTISEMENT

రాష్ట్రంలో మరిన్ని వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటుచేసింది. ప్రతీదానికి ఆయన పేరు తగిలించింది. చివరికి వైజాగ్‌లో బీచ్‌ వ్యూపాయింట్‌కు కూడా వైఎస్సార్ వ్యూపాయింట్ అని బోర్డు పెట్టుకొంది.

వైసీపీ నేతలందరూ ప్రజల చెవులు చిల్లులు పడిపోయేలా రోజూ జగనన్న భజన చేస్తున్నారు. ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు మా సంక్షేమ పధకాలతో మీ జీవితాలు మారిపోతాయని ప్రజలకు గట్టిగా నొక్కి చెపుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ తిరుగులేని మెజార్టీతో గెలుస్తుందని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో చెప్పించుకొంది కూడా.

ఇక సంక్షేమ పధకాలకు ఇచ్చేదీ పావలా అయితే వాటి కోసం రూపాయి చొప్పున వేలకోట్లు ఖర్చు చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇచ్చుకొంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను గడప గడపకి పంపించి చెప్పుకొంటోంది. అయినా ఎందుకైనా మంచిదని చివరికి లక్షల మంది వాలంటీర్లను, లక్షల మంది గృహసారధులను నియమించుకొని ప్రజలకు రోజూ ‘బ్రెయిన్ వాష్’ కూడా చేస్తోంది.

అయినా ప్రజలు తమవైపు ఉన్నారో లేదో ‘టెస్ట్ చేసుకొనేందుకు’ ప్రతీ ఇంటికీ జగనన్న స్టిక్కర్స్ అంటించింది. కనుక మరోవిదంగా చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రం అంతా వైసీపీ రంగులోనే కనిపిస్తోంది. కనుక ఈ నాలుగేళ్ళలో ప్రజల మనసులలో వైసీపీ రంగులలో జగనన్న ఫోటో ముద్రించుకుపోయి ఉండాలి. కలలో అయినా పలవరిస్తే వైసీపీ అనో లేదా జగనన్న అనో పలవరించాలి. అవునా?

కానీ ఈరోజు శ్రీకాకుళంలో మంత్రి ధర్మానప్రసాద రావు ‘జగన్‌ సురక్ష’ కార్యక్రమంలో ఓ యువతిని ‘మన పార్టీ గుర్తు ఏమిటమ్మా?’ అని అడిగితే ఆమె తడుముకోకుండా ‘సైకిల్’ అని చెప్పేసింది!

పాపం ధర్మాన షాక్ అయ్యుంటారు. ‘జగన్‌ సురక్ష’ పేరుతో మంత్రిగారు స్వయంగా సర్టిఫికెట్లు ఇస్తున్నా, ప్రజలు ఇంకా టిడిపిని, సైకిల్ గుర్తును తలుచుకొంటే బాదేయదు?

అంటే టిడిపి అధికారానికి దూరమై నాలుగేళ్ళు అయినా ఇంకా నేటికీ ప్రజల మనసుల్లోనే ఉందని, వైసీపీ నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ వేలకోట్లు ఖర్చు చేసి ఇంత పబ్లిసిటీ చేసుకొంటున్నా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకోలేకపోతోందని అర్దమవుతోంది కదా?

మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైసీపీ ఎలా గెలుస్తోందో, ఆ తర్వాత అయినా 175 సీట్లు ఎలా గెలుచుకొంటుందో వైసీపీ నేతలకే తెలియాలి.

ఇంతకీ సంక్షేమ పధకాలతో మీ జీవితాలు ఎప్పుడో మారిపోయాయని ప్రజలను భ్రమింపజేయాలని ప్రయత్నిస్తూ 175 సీట్లు మనమే గెలుచుకొంటామని వైసీపీ నేతలే భ్రమల్లో ఉన్నారా?

ADVERTISEMENT
Latest Stories