2015 సంవత్సరంలో టాలీవుడ్ అందుకున్న భారీ హిట్లలో బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు, ఆల్ టైం జాబితాలో కూడా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఒక్క ప్రేక్షకుల రివార్డులలోనే కాదు, విమర్శకుల అవార్డులలోనూ ఈ రెండు సినిమాలు పోటాపోటీగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పూర్తయిన ఫిల్మ్ ఫేర్, మా సినీ అవార్డుల వేడుకలలో ఈ రెండు సినిమాలు అవార్డులను కొల్లగొట్టగా, తాజాగా జరిగిన సైమా అవార్డుల వేడుకలోనూ బాహుబలి – శ్రీమంతుడు సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
సైమా 2015 సంవత్సరానికి గానూ ప్రకటించిన అవార్డులలో 7 విభాగాలలో ‘బాహుబలి’ సినిమా అవార్డులను కైవసం చేసుకోగా, ‘శ్రీమంతుడు’ 6 విభాగాల్లో కొల్లగొట్టాడు. కలెక్షన్స్ మాదిరే ఈ అవార్డులలోనూ ‘శ్రీమంతుడు’పై ‘బాహుబలి’దే ఆధిపత్యం కొనసాగింది. ‘బాహుబలి’ సినిమాకు గానూ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ విలన్ (రానా), ఉత్తమ సహాయ నటిమణి (రమ్యకృష్ణ), ఉత్తమ ప్లే బ్యాక్ ఫీమేల్ సింగర్ (సత్య యామిని – మమతల తల్లి), ఉత్తమ ఫైట్ మాస్టర్ (పీటర్ హైయిన్స్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (షెంతిల్ కుమార్)లు అవార్డులు అందుకున్నారు.
ఇక ‘శ్రీమంతుడు’ సంగతికి వస్తే… ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ నటి (శృతిహాసన్), ఉత్తమ సహాయ నటుడు (రాజేంద్రప్రసాద్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీప్రసాద్), ఉత్తమ ప్లే బ్యాక్ మేల్ సింగర్ (సాగర్ – జతకలిసే), మోస్ట్ స్ట్రీమింగ్ సాంగ్ (రామ రామ)లకు గానూ అవార్డులు వశమయ్యాయి. ‘శ్రీమంతుడు’పై ‘బాహుబలి’ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ, కీలకమైన ఉత్తమ నటుడు విభాగంలో మాత్రం ‘శ్రీమంతుడు’ తన సత్తా చాటాడు. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా జరిగిన ఈ ఎంపికలో ఉత్తమ నటుడు విభాగానికి వచ్చే సరికి మహేష్ (40%) – ప్రభాస్ (39%)ల మధ్య కేవలం ఒకే ఒక్క శాతం తేడా వచ్చింది.



