దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం కాదు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెట్టుబడులను రాబడిగా మార్చుకునే అవకాశాలను పెంచుకోవాలి. ఒకప్పుడు శోభన్ బాబు, మురళీమోహన్ లాంటి అగ్ర నటులు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు భూములు, పొలాలు, ఇల్లు కొనేవాళ్ళు. కొన్నేళ్ళయ్యాక అవి ఊహించని స్థాయిలో ధరలు పెరిగి స్థిరమైన భద్రత కల్పించేవి. కానీ ఇవి ఎన్ని కొనుగోలు చేసినా బయట ప్రపంచానికి తెలిసింది లేదు కొత్తగా వీళ్ళకొచ్చే పేరంటూ ఏమీ ఉండేది. అంతా లోలోపల జరిగిపోయే వ్యవహారం. కానీ యంగ్ జెనరేషన్ టాలీవుడ్ నయా స్టార్ల అభిమతం ఇలా లేదు.
ఒకపక్క ఇన్వెస్ట్ మెంట్ ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ లో పడకుండానే తమ డబ్బుతో పాటు పేరు సైతం శాశ్వతంగా నిలిచిపోయేలా ప్లాన్లు వేసుకుంటున్నారు. మహేష్ బాబు ఏషియన్ తో చేతులు కలిపి ఏఎంబి సూపర్ ప్లెక్స్ మొదలుపెట్టాక దానికొచ్చిన స్పందన ఏ బ్లాక్ బస్టర్ సక్సెస్ కీ తీసిపోదు. వీక్ డేస్ లో యావరేజ్ సినిమాలు సైతం ఇందులో హౌస్ ఫుల్ అవుతున్నాయంటే దానికి దక్కిన ఆదరణ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ఇదే సంస్థతో దోస్తీ చేసి మహబూబ్ నగర్ లో స్టార్ట్ చేసిన మల్టీ ప్లెక్స్ సైతం గొప్ప విజయం అందుకుంది. ఇప్పటిదాకా ఇంత గ్రాండ్ గా నడిపిన థియేటర్ ఆ ప్రాంతంలో ఇదే మొదటిది.
Also Read – బెంగుళూరు ప్యాలస్‌లో అపరిచితుడు
త్వరలో అల్లు అర్జున్ నేనేం తక్కువా అన్నట్టు ఏషియన్ తోనే ఇంతకు ముందు హైదరాబాద్ అమీర్ పేట్ సత్యం థియేటర్ ఉన్న స్థలంలో అయిదు స్క్రీన్ల సముదాయాన్ని త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు. ఇందులో హైదరాబాద్ లో ఇప్పటిదాకా లేని ఒనిక్స్ టెక్నాలజీ స్క్రీన్ కూడా ఉంది. వీటి వెనుక ఉన్న ఉద్దేశం ఒకటే. నగర శివారులో భూమి లేదా బంజారా హిల్స్ లో జాగా కొంటే డబ్బు పెరుగుతుంది తప్ప ఎలాంటి పాపులారిటీ రాదు. ఇలా మల్టీప్లెక్సులు పెట్టుకుంటే తర్వాత తరం కూడా గుర్తుపెట్టుకునేలా వీళ్ళ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి విలువకూ ఢోకా ఉండదు. ఇదేమి కొత్తగా జరుగుతున్నది కాదుగా అనుకోవచ్చు.
స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి ఆనవాళ్లుగా ఇప్పటికీ రామకృష్ణ, తారకరామా థియేటర్లను అభిమానులు గుర్తు చేసుకుంటారు. గుంటూరు లాంటి పట్టణాల్లో కూడా ఆయన కట్టించిన హాళ్లు ఉండేవి. వివి వినాయక్ లాంటి దర్శకులు, యువి క్రియేషన్స్ ఎస్విసి లాంటి సంస్థలు ఎప్పుడో థియేటర్ బిజినెస్ లో అడుగు పెట్టాయి. ఇప్పుడు వందల కోట్ల ప్యాన్ ఇండియా మార్కెట్ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్లు ఇలా తమ పేరు మీద మల్టీప్లెక్సులు కట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా కొత్త ట్రెండే. ఏఎంబిలో మహేష్ బాబు ఫోటోలు షీల్డులు పెట్టినట్టు సత్యంలో కూడా బన్నీవి చాలానే పెడతారట. ఇకపై రాబోయే రోజుల్లో అందరూ ఇదే సూత్రాన్ని అనుసరించినా ఆశ్చర్యం లేదు.