కొన్ని సినిమా పోస్టర్ల మీద ‘కేవలం పెద్దలకు మాత్రమే’ అన్న ముద్రణను చిత్రీకరించడం చూసి ఉంటాం. కానీ, ప్రస్తుతం ఓ బ్యాంకు వద్ద మాత్రం ‘కేవలం ఎంపీలకు మాత్రమే’ అన్న బోర్డు పెట్టి రద్దయిన పెద్ద నోట్లను మార్చుకుంటున్నారు. కొన్ని గంటల పాటు కిలోమీటర్ల మేర లైన్ లో నిల్చుని నోట్లను మార్చుకోవడం ప్రజల వంతవుతుంటే… మరి మన ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా నోట్లను మార్చుకుంటున్నారు? అంటే… వారి వెంట ఎప్పుడూ మందిగామధులు వందల స్థాయిలో ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. అయినప్పటికీ ఎంపీల కోసం ఒక ప్రత్యేకమైన బ్యాంకును కేటాయించడం వివాదాస్పదంగా మారింది.
పార్లమెంట్ ఆవరణలో ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో నోట్లు మార్చుకునే వెసులుబాటు “ఒక్క ఎంపీలకు మాత్రమే” అని బోర్డు తగిలించి ఉండడం సామాన్యుల ఆగ్రహానికి కారణమవుతోంది. నోట్ల రద్దుతో పార్లమెంట్ సిబ్బంది అంతా ఆవరణలో గల ఎస్బీఐకు క్యూ కట్టడంతో క్యూ లైన్ బారులు తీరింది. ఈ లైన్ లో నిల్చోవడం మన గొప్ప ప్రజాప్రతినిధులకు సాధ్యం కాకపోవడంతో, ఏకంగా ఆ బ్యాంక్ ను ‘కేవలం ఎంపీల కోసమే’ అని బోర్డు తగిలించేలా చేసారు.
లోక్ సభలో గల 540 మంది ఎంపీలు, రాజ్యసభలో గల 250 మంది ఎంపీలు… అంటే మొత్తమ్మీద 800 మందికి ఒక బ్యాంకును కేటాయించడం సామాన్యుల ఆగ్రహానికి కారణమైంది. కొద్దిపాటి అసౌకర్యాన్ని కూడా సహించలేనటువంటి సదరు ప్రజాప్రతినిధులకు అసలు నోట్లు రద్దు చేసే అర్హత ఎలా ఉందంటూ మండిపడుతున్నారు. సామాన్యులు రోజులో కనీసం మూడు, నాలుగు గంటల సమయం క్యూలో గడుపుతున్నారని, దీని వలన వారి వారి వృత్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని గగ్గోలు పెడుతున్న జనాలకు కొదవలేని పరిస్థితుల్లో ఎంపీల కోసం ఒక బ్రాంచ్ నే కేటాయించడం విమర్శలకు దారి తీస్తోంది.



