
కేంద్రంలో 400 సీట్లతో హ్యాట్రిక్ విజయం అందుకోబోతున్నాం అంటూ ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టిన బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ, షాలు అందుకు తగ్గట్టే జూన్ 4 తరువాత స్టాక్ మార్కెట్ ర్యాలీ జరుగుతుంది అంటూ ప్రకటనలు గుప్పించారు. వారి ప్రచారానికి తగ్గట్టే ఎగ్జిట్ పోల్స్ కూడా 350 + సీట్లతో కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది అంటూ తేల్చి చెప్పాయి.
దీనితో జూన్ 4 కు ఒక్కరోజు ముందే స్టాక్ మార్కెట్ నిఫ్టీ 23 వేల ఆల్ టైం హై మార్కును టచ్ చేసి రికార్డు సృష్టించింది. దీనితో జూన్ 4 న మార్కెట్ మరే స్థాయిని తాకుతుందో అన్న భారీ అంచనాలతో కౌంటింగ్ రోజు మొదలయ్యింది. అయితే ఎవ్వరు ఊహించని తీరులో ఇండియా కూటమి కూడా ఎన్డీయే కూటమికి పోటాపోటీగా సీట్లను దక్కించుకోవడంతో భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది.
Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?
అదే తిరోగమనాన్ని కొనసాగిస్తూ ఈ రోజు ఉదయం కూడా మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఎన్డీయే vs ఇండియా కూటమిలో ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఇటు ఏపీ, అటు బీహార్ ఎంపీ స్థానాలు కీలకముగా మారడంతో టీడీపీ ఎవరికీ మద్దతు ఇస్తుంది అనే అంశం మీద చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు మా మద్దతు ఎన్డీయే కూటమే అని ప్రకటించారు.
ఈ ప్రకటనతో మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయని నేషనల్ మీడియా కూడా బాబు ప్రకటనను హై లైట్ చేస్తూ వార్తలు ప్రచురించాయి. దీనితో అటు ఎన్డీయే కూటమిని ఇటు దేశీయ మార్కెట్ నిలబడానికి చంద్రబాబు ప్రకటన ఊతమిచ్చినట్లయ్యింది. ఈ ఐదేళ్లల్లో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ కు కూల్చడం మాత్రమే తెలిసిందని, కానీ బాబుకు నిలబెట్టడం కూడా తెలుసనని టీడీపీ తమ్ముళ్లు నేషనల్ మీడియా ప్రచురించిన వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.