ఆ దాడికి బాబు కారణమంటే…ఈ దాడులకు జగన్ కారణమా..?

Stone Hurled At CM Jagan

విజయవాడ సింగినగర్ లో ఈ నెల 13 న జరిగిన వైసీపీ మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడికి పూర్తి బాధ్యత టీడీపీ, చంద్రబాబు నాయుడే అంటూ వైకాపా నాయకులు, జగన్ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా, ఆయన మద్దతుదారులు ఏకపక్షంగా నేరం మొత్తం బాబుపై నెట్టే ప్రయత్నం చేసారు.

అయితే ప్రజాస్వామ్య విధానంలో రాజకీయ దాడులు అనేది అప్రజాస్వామ్యమే. అలాగే ఇటువంటి ఘటనలు ఎవరు, ఎవరి పైన చేసిన అది ఆమోదయోగ్యమైన చర్యగా భావించకూడదు. ఇటువంటి కార్యక్రమాలను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించకుడదు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల ముందు కూడా ఇదే తరహాలో విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పైన జరిగిన కోడికత్తి దాడి ఉదంతాన్ని తెర మీదకు తెస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.

ADVERTISEMENT

గతంలో కూడా ఇదే మాదిరి ఎన్నికలకు ముందు జగన్ నా పై దాడి జరిగింది, దానికి కారణం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే అంటూ ప్రజలలో సింపతీ సంపాదించి అధికార పీఠం దక్కించుకుందని, అలాగే జగన్ బాబాయ్ వివేకా హత్య కేసులో కూడా బాబు పాత్ర ఉందని, నారా సుర రక్త చరిత్ర అంటూ బ్లూ మీడియాలో కథనాలు నడిపి అధికారానికి అడుగులు వేశారంటూ టీడీపీ, జనసేన నేతలు వైసీపీ పై ఎదురుదాడి చేస్తున్నారు.

అలాగే జగన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రతిపక్ష పార్టీల అధినేతల పై, వారి నాయకుల మీద, ఆ పార్టీ కార్యాలయాల మీద జరిగిన దాడుల నేపథ్యంలో వైకాపా నేతలు చేసిన విమర్శలను, మాట్లాడిన దిగజారుడు వ్యాక్యలను మరోసారి ప్రజల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు బాబు. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని చెప్పినా జగన్ గాయానికి బాబే కారణమంటూ వైసీపీ నేతలు ఓట్ల రాజకీయాలకు మరోసారి తెరలేపారన్నది సుస్పష్టమయ్యిందంటూ ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.

దీనితో ‘వైసీపీ కి మైలేజ్, టీడీపీ కి డామేజ్’ ఒక్కసారిగా జరిగిపోతుంది అని ఆశించిన వైకాపా నాయకులకు ఇప్పుడు విశాఖలో టీడీపీ అధినేత బాబు పైన, తెనాలి లో జనసేన అధినేత పవన్ పైన ఏకకాలంలో రాళ్లతో దాడులు జరగడం విస్మయానికి గురి చేసింది. జగన్ మీద దాడి జరిగితే దానికి కారణం బాబు అంటూ వైసీపీ ప్రచారం మొదలుపెడితే… ఇప్పుడు బాబు, పవన్ మీద జరిగిన రాళ్ల దాడికి జగనే కారణమంటూ టీడీపీ, జనసేనలు వైసీపీ పై విరుచుకుపడే అవకాశం ఉంది.

అలాగే వైసీపీ కూడా ఈ విషయంలో టీడీపీ, జనసేనల మూకుమ్మడి విమర్శల దాడిలో డిఫెన్స్ లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ‘మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో…మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం’ అనే సామెత మాదిరి ‘జగన్ పై దాడికి బాబు ఎలా అయితే కారణం అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారో…అలాగే బాబు, పవన్ ల మీద జరిగిన దాడికి జగన్ కారణంటూ టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తారు కదా..! అది నిజమైతే ఇది నిజమే అవ్వాలిగా అనే ఎదురు ప్రశ్నలు వైసీపీ ఎదుర్కోకతప్పదు.

ADVERTISEMENT
Latest Stories