గత కొన్నేళ్లుగా విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదల సందర్భంగా చోటు చేసుకుంటున్న పిల్లల మరణాలు తల్లితండ్రులతో పాటుగా సగటు విద్యార్థిని కూడా భయపెడుతున్నాయి. పరీక్షలో మార్కులు సరిగా రాకపోతే, పరీక్షలో పాస్ కాకపోతే ఇక చావే శరణ్యం అనేలా విద్యార్థుల జీవితాలలో చదువు అనేది ప్రాణాలు తీసేంత భారంగా మారిపోతుంది.
అసలు ఆ విద్యార్థుల బలవన్మరణాలకు కారణాలేమిటి.? నానాటికి ఈ సంఖ్య అనూహ్యంగా ఎందుకు పెరుగుతూ పోతుంది.? ఈ సమకాలిన పోటీ ప్రపంచంలో ఒక్క ఫెయిల్యూర్ ని, ఒక్క వెనుకబాటుని కూడా విద్యార్థులు ఎందుకు తీసుకోలేకపోతున్నారు.?
ఇందుకు దేశ విద్యావ్యవస్థను నిందించాలా.? లేక విద్య పేరుతో ర్యాంకుల కోసం పిలల్ల విలువైన కాలాన్ని కేవలం పుస్తకాలే పరిమితం చేస్తూ, నాలుగు గోడల మధ్య బందీగా మారుస్తున్న విద్యాసంస్థలను తప్పుపట్టాలా.? లేక పిల్లల చదువును, మార్కులను ఇతర పిల్లలతో పోలుస్తూ వారి మీద చదువు ఒత్తిడి పెంచుతున్న తల్లితండ్రుల వైపు వేలెత్తి చూపాలా.?
ముఖ్యంగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలవుతుంటే చాలు మీడియాలో పదుల సంఖ్యలో పిల్లల బలవన్మరణాలు వార్తలు గుప్పుమంటున్నాయి. తక్కువ మార్కులు వచ్చాయనే అవమానంతో ఒకరు, అసలు పరీక్షలో పాస్ అవుతానా లేదా అనే భయంతో మరొకరు, అనుకున్న స్థాయి మార్కులు రాలేదు అంటూ ఆవేదనతో ఇంకొకరు ఇలా వారి విలువైన బంగారు భవిష్యత్ ని బలవంతంగా అంపశయ్య మీద పడుకోబెడుతున్నారు.
పిల్లలకు విద్యార్థి దశ నుంచే సక్సెస్ తోపాటుగా ఫెయిల్యూర్ ని కూడా ఒప్పుకునే మానసిక స్తైర్యాన్ని అటు తల్లితండ్రులు ఇటు ఉపాధ్యాయులు వారికీ అర్ధమయ్యేలా చెప్పగలగాలి. ఒక్క అపజయం ప్రాణాలు తీసుకునేంత భారం కాకూడదు అనేలా వారికి అవగాహ కల్పించాలి.
సమాజం కూడా విద్యార్థులను వారి మార్కులతో, ర్యాంకులతో కాకుండా వారిలో ఉన్న టాలెంట్ తో గుర్తించాలి, గౌరవించాలి. తల్లితండ్రులు కూడా పిల్లలకు ఏదిఏమైనా మేము మీ వెనుక ఉంటాం, ఉన్నాం అనే భరోసా అందిచగలగాలి.
ఉపాధ్యాయులు సైతం నిత్యం పుస్తకాలే, మార్కులే అనేలా కాకుండా ఒక సమస్య ఎదురైతే వాటి నుంచి ఎలా దైర్యంగా బయటపడాలి అనే సామజిక అంశాల పై ఆవాహన కలిపించాలి, అటువంటి వాటిని బలంగా ఎదుర్కొనేలా మానసిక స్తైర్యాన్ని నింపేలా వారిని తీర్చిదిద్దాలి.
అప్పుడే నేటి భారతం ఈ చదువు ఒత్తుడిలా నుండి మార్కుల వేట నుండి ర్యాంకుల ప్రచారాల నుంచి స్వేచ్ఛగా బయటకొస్తారు. విజయాన్ని ఎలా అయితే ఆనందంగా జరుపుకుంటామో అలాగే అపజయాన్ని కూడా అంతే బలంగా ఎదుర్కోగలిగే విధంగా విద్యారులను సిద్ధం చేయవలిసిన బాధ్యత సమాజం మీద కూడా ఉంది అనే విషయాన్ని అందరు గ్రహించాలి.






