సుగాలి ప్రీతి కేసులో సాయం కాదు న్యాయం జరిగేనా.?

Sugali Preeti Case

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారిన కేసులలో సుగాలి ప్రీతి హత్యాచార కేసు కూడా ఒకటి. 2017 లో జరిగిన ఈ దారుణం ఇప్పటికి అధికార – ప్రతిపక్షాల మధ్య దాగుడుమూతలు ఆడుతూనే ఉంది, ఇరు వర్గాల రాజకీయ అంశంగా మారుతూనే వస్తుంది.

2019 ఎన్నికలకు ముందు అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సుగాలి ప్రీతి హత్య నాటి నుంచి నేటి వరకు న్యాయం కోసం కోర్ట్ లతో పాటుగా రాజకీయ పార్టీల చుట్టూ ఆయా పార్టీల అధినేతల చుట్టూ తిరుగుతూనే ఉంది.

ADVERTISEMENT

టీడీపీ ప్రభుత్వ హయాంలో న్యాయం కావాలి అంటూ ప్రతిపక్ష వైసీపీ ని ఆశ్రయించిన సుగాలి ప్రీతి కుటుంబం ఆ తరువాత ఎన్నికలలో ప్రభుత్వాలు మారడంతో వైసీపీ హయాంలో న్యాయం కోసం ఎదురుచూసింది.

కానీ ఫలితం మాత్రం శూన్యం కావడంతో సమస్యను పవన్ దృష్టికి తీసుకురావడంతో పవన్ సుగాలి ప్రీతికి న్యాయం చెయ్యాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసైనికులతో కలిసి లాంగ్ మార్చ్ నిర్వహించారు. దానితో సుగాలి ప్రీతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది, ప్రజల, మీడియా దృష్టిని ఆకర్షించింది.

అయితే గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కేసులో న్యాయం అనేది కనిపించకపోవడం, పవన్ ఈ కేసు పై ప్రత్యేక ద్రుష్టి పెట్టడంతో సుగాలి ప్రీతి కేసు వైసీపీ – జనసేన మధ్య రాజకీయ అంశంగా మారిపోయింది. 2017 లో తమ కుమార్తె సుగాలిని అత్యంత దారుణంగా హత్యాచారం చేసి హత్య చేశారన్నది బాధిత తల్లి పార్వతి, తండ్రి రాజు నాయక్ ల ఆరోపణ.

అయితే 2024 జనసేన ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి కేసు కూడా ఒక భాగమయ్యింది. ఇక ఆ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, జనసేన ప్రభుత్వంలో భాగమవ్వడంతో సుగాలి ప్రీతి కుటుంబానికి తప్పక న్యాయం జరుగుతుంది అనే భావన అటు సుగాలి ప్రీతి కుటుంబానికి ఇటు రాష్ట్ర ప్రజలకు కలిగింది.

కానీ కట్ చేస్తే, కేసులో ఆధారాలన్నీ నాశనం అయ్యాయంటూ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. దీనితో సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఉప ముఖ్యమంత్రి పవన్ పై జనసేన పై విమర్శలు చేసి, కేసును సిబిఐ కి అప్పగించాలంటూ డిమాండ్ చేసారు లేదంటే తమ బిడ్డకు న్యాయం కోసం యాత్ర చేస్తానంటూ ప్రకటించారు.

దీనితో కూటమి ప్రభుత్వం సుగాలి కేసును సిబిఐ కి అప్పగించింది. ఇక ఇప్పుడు పార్వతి, రాజు నాయక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ వద్దకు చేరారు. కూటమి ప్రభుత్వం తమ బిడ్ద కేసును పక్కన పడేసింది, కేసు విచారణ లో వేగం పెంచేలా జగన్ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని, కూటమి ప్రభుత్వం తమకు రావాల్సిన పెన్షన్ కూడా నిలిపివేసిందంటూ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ వైఎస్ జగన్ సాయం కోరారు.

అందుకు జగన్ కూడా స్పందిస్తూ పార్టీ తరుపున ఈ కేసు కు అవసరమైన న్యాయ సాయాన్ని అందిస్తామని, భవిష్యత్ లో సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే నాడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ అప్పుడు న్యాయం చెయ్యలేకపోయింది, ఇప్పుడు సాయం చేస్తానంటూ హామీ ఇస్తుంది.

ఇక నాడు విపక్షంలో ఉన్న జనసేన అప్పుడు సాయం చేసింది, కానీ ఇప్పుడు న్యాయం చేయలేకపోతోంది. దీనితో ఈ కేసు ఎప్పుడు అధికార పార్టీకి – ప్రతిపక్షానికి మధ్య రాజకీయ అంశంగా మారుతుంది తప్ప బాధిత కుటుంబానికి న్యాయం మాత్రం అందని ద్రాక్ష మాదిరి ఊరిస్తూనే వస్తుంది.

నాడు పవన్, నేడు జగన్ ఇద్దరు కూడా ప్రీతి తల్లితండ్రులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు కానీ న్యాయం చేయలేకపోతున్నారు. మరి సుగాలి ప్రీతి కూడా మరో ఆయిషా మీరా అవుతుందా.?

ADVERTISEMENT
Latest Stories