తెలుగుదేశం పార్టీ తరపున ఇటీవలే ఎన్నికలలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ నేడు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. పార్టీలు మారడం అనేది ఇటీవలే కాలంలో సర్వసాధారణమే. అయితే సునీల్ కు ఇది ఇంకా సాధారణం. గత మూడు ఎన్నికలలో ఆయన మూడు వేరు వేరు పార్టీలలో ఉండటం గమనార్హం.
2009లో ప్రజారాజ్యంపార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు చేతిలో ఓడిపోయారు. 2014లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. ఇటీవలే ఎన్నికలలో టీడీపీలో చేరి మళ్లీ ఎంపీగా పోటీ చేసి వంగా గీత చేతిలో పరాజయం చెందారు.
వరుసగా మూడు పరాజయాలతో ఇక తనకు ప్రత్యక్ష ఎన్నికలు కలిసి రావు అనుకున్నారేమో… 2022లో ఆయనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కలిపించాలి అంటూ కి అధికార పార్టీతో మంతనాలు జరిపినట్టు సమాచారం. జగన్ కూడా అందుకు ప్రాథమికంగా ఒప్పుకున్నారని తూర్పు గోదావరిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వ్యాపార రంగంలో ఉన్న ఆయన తన వ్యాపార పరిరక్షణ కోసం ప్రభుత్వంకు అనుకూలంగా ఉండాలని ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని కూడా సమాచారం. ఎన్నికల ఓటమి తరువాత నుండి సునీల్ పెద్దగా యాక్టీవ్ లేరు… ఎన్నికలకు ముందు కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నది లేదు. దానితో ఇది తమకు పెద్ద నష్టం ఏమీ కాదని టీడీపీ వారు అంటున్నారు.





