సిఎం జగన్‌ ఢిల్లీలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టు నోటీస్ జారీ!

Jagan Supreme Courtప్రస్తుతం సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. తర్వాత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. జగన్‌ ఢిల్లీ యాత్రలకు ‘ట్యాగ్ లైన్’ ‘రాష్ట్రానికి సంబందించిన అంశాలు’ కనుక ఆయన వాటి గురించే మాట్లాడారని ఆత్మసాక్షి చెప్పేసింది.

అయితే ముందస్తు ఎన్నికలు, కోర్టు కేసుల గురించే జగన్‌ ఢిల్లీ వెళుతుంటారని గిట్టనివాళ్ళు చెప్పుకొంటారు. అదీ అప్రస్తుతం. ఆయన దేని కోసం ఢిల్లీ వెళ్ళినప్పటికీ, ఆయన అక్కడ ఉన్నప్పుడే అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆయన కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.

ADVERTISEMENT

డైలీ సీరియల్లా ఏళ్ళ తరబడి సాగుతున్న ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సీబీఐ, ఈడీలు ఒకేసారి సమాంతరంగా విచారణ జరపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే అలా చేస్తే విచారణలో గందరగోళం ఏర్పడుతుంది కనుక ముందుగా సీబీఐ విచారణ చేయాలని, తర్వాతే ఈడీ విచారణ చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది.

ఈ తీర్పునే ఈడీ సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్‌ సంజయ్‌ కరోలలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, దీనిపై సెప్టెంబర్‌ 5వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయవలసిందిగా సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ రెడ్డిలకు చెందిన జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. వాటితో పాటు ఈ కేసులలో ఏ-2 ముద్దాయిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది.

సెప్టెంబర్‌ 5న మళ్ళీ ఈ కేసు విచారణ చేపట్టినప్పుడు ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టులోనే ద్విసభ్య లేదా త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసే విషయంపై కూడా తమ నిర్ణయం చెపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది.

అయితే ఈ నోటీసు వలన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు కొత్తగా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదనే అర్దం అవుతోంది. కేసుల విచారణ వేగంగా జరిపి ముగించాలనుకొంటేనే ఇబ్బంది తప్ప కేసులు ముందో వెనుకో ఎన్ని ఏళ్ళు నడిపించుకొన్నా అభ్యంతరం ఏముంటుంది? పైగా కౌంటర్ దాఖలు చేయడానికే సుప్రీంకోర్టు రెండు నెలలు గడువిస్తున్నప్పుడు ఆందోళన చెందడానికి ఏముంది ఈ నోటీసులలో… సిఎం జగన్‌ ఢిల్లీలో ఉన్నప్పుడే ఇచ్చారని చెప్పుకోవడం మినహా?

ADVERTISEMENT
Latest Stories