కేరళలోని పరమ పవిత్ర శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ప్రవేశం కల్పించాలా? వద్దా? అన్న విషయమై, అయ్యప్ప తరపున వాదనలు వినిపించిన హైదరాబాద్ న్యాయవాది సాయి దీపక్, ధర్మాసనంతో ‘భేష్’ అనిపించుకున్నారు. తనను తాను దేవుడి తరఫు న్యాయవాదిగా ప్రకటించుకోగా, వాదనలు వినిపించేందుకు 10 నిమిషాల సమయాన్ని ధర్మాసనం ఇచ్చింది.
[m9ad]
అయితే తన వాక్పటిమ, లాజిక్ తో సాయి దీపక్ వాదన దాదాపుగా రెండు గంటల పాటు సాగింది. ఆయన వాదన జ్ఞాన బోధకంగా ఉందని న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారిమన్ వ్యాఖ్యానించడం గమనార్హం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఆలయ యజమాని అయిన దేవుడికి, తన ఇంట్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రైవరీ ఉందని, నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవడం అందులో భాగమేనని దీపక్ వాదించారు.
దేవుడు కూడా న్యాయబద్ధమైన వ్యక్తిగా గతంలో కోర్టు గుర్తించిందని గుర్తు చేశారు. మహిళల హక్కుల సంగతి సరే, మరి దేవుడి విశ్వాసాలకు విలువ లేదా? ఆయనకూ హక్కులన్నీ ఉంటాయి. అలాగే బ్రహ్మచారిగా ఉండే హక్కు అయ్యప్పకుంది. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆలయానిదే, దేవుడి హక్కులను హరించడం కుదరదంటూ దీపక్ చేసిన వాదన అందరినీ ఆకట్టుకుంది.
వందలాది మందిని చంపిన ఉగ్రవాదులకు న్యాయ సహాయాన్ని అందిస్తున్న వేళ, దేవుడికి అన్యాయం జరుగుతుంటే, ఆయన తరఫున వాదించడం సమంజసమేనని భావించి తాను వచ్చానని ధర్మాసనానికి దీపక్ తెలిపారు. మహిళలను నియంత్రించడం హాస్యాస్పదం అంటున్న వారికి దేవుడిపై భక్తి ఉందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) కింద ప్రజలకు తమ ధర్మాన్ని పాటించే హక్కు ఉన్న విధంగానే, దేవుడికి కూడా తన ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ ఉందన్నారు.
ఆపై కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయ్యాయని చెప్పిన ధర్మాసనం, ఉభయపక్షాల న్యాయవాదులు మరేదైనా చెప్పాలనుకుంటే, ఏడు రోజుల్లోగా తమ వాదనను సంక్షిప్తంగా తెలియజేయాలని ఆదేశిస్తూ, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వాద ప్రతివాదనలతో ఈ ఏడాది తుది తీర్పు వెలువడనుండడంతో, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.



