వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలులో కూర్చొని ఎదురుచూస్తుండగా, ఆయన విశ్వభారతి హాస్పిటల్ చుట్టూ తన అనుచరులతో రక్షణ వలయం ఏర్పాటుచేసుకొని సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.
కానీ జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ పి.నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని కొద్ది సేపటి క్రితం స్పష్టం చేసింది. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 25వ తేదీన విచారణ జరపాలని సూచించింది.
ఇప్పటివరకు అవినాష్ రెడ్డి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లు, సీబీఐ తీరుని బట్టి చూస్తే అప్పటి వరకు సీబీఐ ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేదని భావించవచ్చు. ఇప్పుడు ఈ కేసు హైకోర్టు వెకేషన్ బెంచ్ పరిధిలో ఉంది కనుక సీబీఐ అధికారులు హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావచ్చు.
ఆ తర్వాత ఎప్పటిలాగే ఈ కధ మళ్ళీ మొదటి నుంచి అంటే మళ్ళీ సీబీఐ ఆయనను విచారణకు హాజరుకావాలంటూ నోటీసు పంపడం, చివరి నిమిషంలో తనకు వేరే కార్యక్రమాలు ఉన్నందున హాజరుకాలేనని చెప్పి తప్పించుకోవడం, అప్పుడు సీబీఐ ఆయన కోరుకొన్నట్లుగా మరో తేదీకి నోటీస్ పంపించడం, అప్పుడు మళ్ళీ ఆయన సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేయడం… ఈ నాలుగు స్తంభాలాట ఇలా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందేమో?
అయితే అవినాష్ రెడ్డి సీబీఐకి లొంగిపోకుండా ఇంత కధ నడిపిస్తుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించకపోవడం విశేషం. కర్నూలులో రెండు రోజులుగా ఇంత డ్రామా జరుగుతున్నా స్పందించలేదు. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీని కోరారని తెలిసి ఉన్నా జగన్ స్పందించలేదు.
ఒకవేళ అవినాష్ రెడ్డి నిర్దోషి అని నమ్ముతున్నట్లయితే ఆయన సీబీఐ నుంచి తప్పించుకొనేందుకు ఇంతగా ప్రయత్నించేబదులు, స్వచ్ఛందంగా లొంగిపోయి విచారించుకోవాలని చెప్పి ఉండి ఉంటే ప్రజలకు కూడా ఆయనపై సదాభిప్రాయం ఏర్పడి ఉండేది. కానీ సీబీఐ అధికారులు తన వద్దకు చేరుకోవడానికి వీలు లేకుండా వైసీపీ కార్యకర్తలతో రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని చెప్పవచ్చు. అలాగే సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేసేందుకు కర్నూలు వచ్చినప్పుడు జిల్లా ఎస్పీ వారికి సహకరించాల్సి ఉండగా డిజిపి నుంచి ఆదేశాలు రాలేదని చెప్పి అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా కాపాడుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ, అవినాష్ రెడ్డి ఈవిదంగా వ్యవహరిస్తూ దీనిని తన శక్తిసామర్ధ్యాలకు, సీబీఐకి కూడా అగ్నిపరీక్షగా మార్చేసుకోవడం వలన ఇరు వర్గాలు వెనక్కు తగ్గలేని దశకు చేరుకొన్నారని చెప్పవచ్చు. కనుక ఈ సీబీఐ-అవినాష్ రెడ్డి కధ ఎప్పుడు ఏవిదంగా ముగుస్తుందో తెలీని పరిస్థితి కనిపిస్తోంది.



