2016లో తెలుగు చిత్రాలలో అన్నింటి కంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా ‘పెళ్లిచూపులు’ నిలిచింది. పెట్టిన పెట్టుబడికి దాదాపుగా 20 రెట్లు మొత్తాన్ని ఆర్జించిన ఈ సినిమా ఇతర భాషల్లోకి తర్జమా అయ్యేందుకు సిద్ధపడుతోంది. బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టనున్న ‘పెళ్లిచూపులు’ తమిళ రీమేక్ కు సంబంధించి తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది.
‘పెళ్లిచూపులు’ సినిమాలో హీరోయిన్ పాత్రలో కనిపించిన రీతూ వర్మ స్థానంలో మిల్కీ బ్యూటీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్న ఈ సినిమాకు సెంథిల్ వీరస్వామి దర్శకత్వం వహించబోతున్నారు. హీరో పాత్రను ఇంకా ఖరారు చేయని చిత్ర యూనిట్, సినిమాలో అత్యంత కీలక పాత్ర అయినటువంటి హీరోయిన్ అవకాశాన్ని మాత్రం తమన్నాకు కల్పించినట్లుగా తెలుస్తోంది.
‘బాహుబలి’ విజయం తర్వాత దాదాపుగా అన్ని భాషలలోనూ బిజీ హీరోయిన్ గా తమన్నా మారిపోయింది. ఇటీవలే ‘అభినేత్రి’ ద్వారా మూడు భాషల ప్రేక్షకులను పలకరించిన మిల్కీ బ్యూటీ, ఈ ఏడాది సమ్మర్లో మరోసారి ‘బాహుబలి’ సినిమా ద్వారా ప్రేక్షకులకు దర్శనమివ్వనుంది. వరుసగా మంచి సినిమాల్లో అవకాశాలు లభిస్తుండడంతో ముద్దుగుమ్మ పట్టరాని సంతోషంలో మునిగి తేలుతొందట.



