పెద్ద కుటుంబాల్లో ఏ చిన్న అంశం జరిగినా అది ఓ సంచలనమే. ప్రజలు తమ గురించి, తమ కుటుంబాల గురించి అయినా పట్టించుకోవడం మానేస్తారేమో గాని, బాగా పేరున్న కుటుంబాల్లో చీమచిటుక్కుమన్నా దాన్ని పెద్ద చర్చనీయాంశంగా మార్చేస్తారు. దాని గురించే చర్చించుకుంటూ కాలక్షేపం చేసేస్తారు. మరి అదే విశ్వవిఖ్యాతనట సార్వభౌమ నందమూరి తారకరామారావు కుటుంబానికి సంబంధించిన అంశం అయితే ఇక ఆ చర్చకు అంతం ఉండదు అని అంటున్నారు విశ్లేషకులు.
గత కొంతకాలంగా జూనియర్ ఎన్.టి.ఆర్ ని బాబు దూరంగా ఉంచుతున్నారు అనే వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. జూనియర్ ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే లోకేష్ కి మనుగడ ఉండదు అనే ఆలోచనతోనే బాబు జూనియర్ ని దూరంగా పెట్టారు అనే విమర్శలు వచ్చాయి. ఇటీవల విజయవాడలో జరిగిన ఏన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ని ఆహ్వానించకపోవడం పై కూడా ఓ స్థాయిలో చర్చ జరిగింది.
ఎన్.టి.ఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించేందుకు చంద్రబాబు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించేందుకు టి.డి జనార్దన్ కి బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీని పార్టీ తరుపున కాకుండా ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ఎన్.టి.ఆర్ వారసులు, కుటుంబ సభ్యులందరిని ఆహ్వానించే పనిలో నిమగ్నమైయ్యింది.
ఏన్.టి.ఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి తో టి.డి జనార్దన్ భేటీ అయ్యారు. శతజయంతి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. శతజయంతి ఉత్సవాలకు సంబందించిన ఆహ్వాన పత్రికను పురందేశ్వరికి అందజేశారు. ఆమె కూడా ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.
అదే విధంగా టి.డి జనార్దన్ జూనియర్ ఎన్.టి.ఆర్ తో కూడా భేటీ అయ్యారు. శతజయంతి ఉత్సవాలకు ఖచ్చితంగా రావాల్సిందిగా ఆహ్వానించారు. సుమారు అరగంట పాటు వీరి మధ్య భేటీ జరిగినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో పలు రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. జూనియర్, బాబుల మధ్య గత కొంతకాలంగా ఉన్న గ్యాప్ వల్ల వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ లో జరగబోయే ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలకు నందమూరి కుటుంబ సభ్యులందరిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఒకే వేదికను కుటుంబ సమేతంగా పంచుకొనున్నారు. దీంతో తామంతా ఒక్కటేననే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని, తద్వారా తమలోతమకి ఎలాంటి విభేదాలు లేవని ప్రజలకు సంకేతం ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం బాబు ని ఆయన కుటుంబ సభ్యులని అన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్న వైసీపీకి వీరి కలయికవల్ల వారు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు అవుతుందని బాబు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. దీని వల్ల అటు టీడీపీ కార్యకర్తల్లో జోష్ వచ్చినట్లు అవుతుందని, మరో పక్క జూనియర్ ఫ్యాన్స్ కూడా కాస్త చల్లబడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జూనియర్ తో సహా నందమూరి కుటుంబ సభ్యుల రాకతో శతజయంతి ఉత్సవాల్లో నిండుదనం వస్తుందని, అదేవిధంగా వైసీపీకి గట్టి కౌంటర్ కూడా ఇచ్చినట్లు అవుతుందని, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అవుతుందని, బాబు స్కెచ్చే వేరనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.



