టీడీపీ ఫ్యాన్స్… జగన్ కు థాంక్స్…!

Jagan Counters Sharmila

రాజకీయాలలో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవన్నది ఓ నానుడి. అంటే “ఓ నాయకుడి పొలిటికల్ కెరీర్ తనకు తానే నాశనం చేసుకుంటాడు తప్ప, ప్రత్యర్థి నాయకులు కాదు” అన్నది పరమార్ధం. భారతీయ రాజకీయ ముఖచిత్రం గమనిస్తే… ఇది నిజమని తెలిపిన సందర్భాలు కోకొల్లలు.

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా… “ప్రతి ఇంటిలో తన తండ్రి ఫోటో పక్కనే తన ఫోటో కూడా ఉండే విధంగా పాలన చేస్తాను” అంటూ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన వైనం తెలిసిందే.

ADVERTISEMENT

నిజానికి అంతటి గొప్ప అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు కూడా! రాష్ట్రంలో కూడా అంత చారిత్రాత్మకమైన ఘటనలకు అవకాశం ఉంది కూడా! అరాచకపు పాలన వైపు కాకుండా, తన దృష్టి అభివృద్ధి పాలన వైపు మళ్లించి ఉంటే, నేటి దుస్థితికి ఆమడ దూరంలో ఉండి ఉండేవారేమో!?

రాజధాని పనులను కొనసాగించి, పోలవరం నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రానికి కియా వంటి మరికొన్ని పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకువచ్చి, చెత్త పన్నుల పేరుతో ప్రజలను వేధించకుండా, మౌలిక వసతి సదుపాయాలను ఏర్పాటు చేసి ఎన్నికల సమరానికి జగన్ సిద్ధమై ఉంటే… ఏమో అసలు ప్రతిపక్షం ఉండేదో లేదో!?

ఆ ఊహల లోకం నుండి వాస్తవ పరిస్థితికి వస్తే… “ప్రతి ఇంటిలో జగన్ ఫోటో పెట్టుకునే మాట పక్కన పెడితే, వైఎస్సార్ ఫోటోలు కొలువై ఉన్న ఇంటి నుండి ఆయన ఫోటోలను కూడా అభిమానులు తొలగించేటంత దిగ్విజయ పాలన” చేసారన్నది పరిశీలకుల మాటలు, వైఎస్సార్ అభిమానుల ఆవేదనలు కూడా!

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… రాబోయే రోజుల్లో ప్రతి ఇంటిలో చంద్రబాబు ఫోటో పెట్టుకునే విధంగా జగన్ తన పాలనను సాగించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. షర్మిల అన్నట్లు… అద్దంలో చూసుకుంటే తనకు తాను కనపడుతున్నారో లేక చంద్రబాబు ప్రతిబింబం కనిపిస్తుందో తెలియనంతగా, టీడీపీ అధినేత విలువను ఎవరెస్టున కూర్చోపెట్టారు జగన్.

అభివృద్ధిలో గుజరాత్ తో పోటీ పడే స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన ప్రభావంతో దిక్కులేనిది అయ్యింది. లోటు బడ్జెట్ తో తలమునకలై ఉన్న రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పధంలో నిలిపే విధంగా చేయడంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి అనిర్వచనీయం, అనన్య సామాన్యం.

అయితే ఆనాటి చంద్రబాబు పడిన కష్టం నేడు జగన్ పాలన ద్వారా వెలుగులోకి వచ్చినట్లయ్యింది. నాడు చంద్రబాబు కష్టాన్ని గుర్తించలేక జగన్ కు ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చారు. ఆ ఒక్క అవకాశమే ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ‘భస్మాసుర హస్తం’లా మారిందని తెలుసుకునే పాటికి రాష్ట్రం మరో పది పదిహేనేళ్ళు వెనక్కి వెళ్ళింది.

కూటమిగా ఏర్పాటు అయిన టీడీపీ – జనసేన – బీజేపీ ప్రచార హోరు చూసినా… నిర్వేదంగా మారిన జగన్ ముఖచిత్రం గమనించినా… రాబోయే ఎన్నికలలో విజయం ఎవరిని వరించబోతుందో అన్న విషయం స్పష్టమైనట్లే!

విజయం విషయం పక్కన పెడితే… జగన్ వలన చంద్రబాబు విలువ ఏమిటో తెలుగు ప్రజలకు స్పష్టమైంది. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఆ ప్రభావమే వెలుగు చూసింది. ఖండాంతరాలలో ఉన్న తెలుగు వారు కూడా చంద్రబాబుకు సంఘీభావం తెలిపారంటే, ఓ విధంగా టీడీపీ అభిమానులంతా జగన్ కు ధన్యవాదాలు తెలపాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories