ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపి కూటమి 2 సీట్లు గెలుచుకొని మరో 159 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతుండగా వైసీపి కేవలం 14 స్థానాలలో మాత్రమే ఆధిక్యతలో ఉంది. నారా లోకేష్ చెప్పిన్నట్లుగా టిడిపి కూటమి 160కి పైగా సీట్లు గెలువబోతోందని స్పష్టమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి, జనసేన, బీజేపీ శ్రేణులు అప్పుడే రోడ్లపైకి వచ్చి టపాకాయలు పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. టిడిపి, జనసేన, బీజేపీల కార్యాలయాలు మూడూ కళకళలాడుతుండగా, వైసీపి కార్యాలయాలు, తాడేపల్లి ప్యాలస్ బోసిపోయి నిర్మానుష్యంగా మారిపోయాయి.
విశాఖ రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజల కళ్ళకు మరోసారి గంతలు కట్టేందుకు రుషికొండపై రూ.400 కోట్లకు పైగా ఖర్చుచేసి జగన్ ప్రభుత్వం విలాసవంతమైన భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే. టిడిపి కూటమి గెలుపు ఖాయం అవడంతో టిడిపి కార్యకర్తలు తొలిసారిగా ఆ భవనంపైకి చేరుకొని పార్టీ జెండాలు ఎగరేశారు. ఇంతకాలం టిడిపి, జనసేన నేతలు రుషికొండ దరిదాపులకు కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కానీ తొలిసారిగా వారిని భవనంపైకి టిడిపి జెండాలతో వెళ్ళేందుకు అనుమతించారు.
టిడిపి కార్యకర్తలు రుషికొండ ప్యాలస్‌పై టిడిపి జెండా ఎగురవేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిడిపి కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతిని రాజధాని చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు కనుక ఇప్పుడు రుషికొండ ప్యాలస్‌ను ఏవిదంగా దేనికోసం ఉపయోగించుకుంటారో చూడాలి.




