మూడేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రం కూడా రివర్స్ గేరులో ప్రయాణిస్తూ దివాళా తీసే పరిస్థితికి చేరుకొందని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ చార్జ్ గుండ లక్ష్మీదేవి అన్నారు. ఆమె అధ్వర్యంలో గురువారం రాత్రి శ్రీకాకుళం పట్టణంలో 24వ డివిజన్‌లో టిడిపి నేతలు, కార్యకర్తలు కలిసి బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
విద్యుత్ ఛార్జీలు పెంచేసిన జగన్ సర్కార్ సామాన్య ప్రజలపై భరించలేనంత భారం మోపిందని, కనుక విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ లైట్లు ఆర్పుకొని కొవ్వొత్తుల వెలుగులో చీకటి రాత్రులు గడపాల్సివస్తోందని ఆమె అన్నారు. టిడిపి నేతలు ప్రజలకు ఇంటింటికీ వెళ్ళి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మూడేళ్ళుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన ఏవిదంగా సాగుతోందో అందరం చూస్తున్నాము. ఇకనైనా యువత, మహిళలు అందరూ మేల్కొని, జగన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ముందుకు రావాలి లేకుంటే ఆ తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెడతారు,” అని అన్నారు.



