టిడిపి, జనసేనల పొత్తులు, ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేసుకొన్నాయి. కానీ అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది. రెండు పార్టీలు నష్టపోకుండా సీట్ల సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది. కానీ ఒకరు నష్టపోకుండా మరొకరు లాభపడటం ఎన్నడూ సాధ్యం కాదు. కనుక రెండు పార్టీలు త్యాగాలు చేయక తప్పదు.
టిడిపిలో చాలా మంది మాజీలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు తాము పోటీ చేయబోతున్న నియోజకవర్గాలలో గత నాలుగున్నరేళ్ళుగా పనిచేసుకొంటున్నారు. వారిలో చాలా మందికి చంద్రబాబు నాయుడు టికెట్స్ ఖరారు చేశారు కూడా.
ఇదేవిదంగా జనసేనలో కూడా చాలా మంది నేతలు భారీగా డబ్బు ఖర్చుచేస్తూ తాము పోటీ చేయాలనుకొంటున్న నియోజకవర్గాలలో సామాజిక సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు పార్టీలలో ఆశావాహులు కూడా తమకే టికెట్ లభిస్తుందనే గట్టి నమ్మకంతో ఖర్చుకి వెనకాడకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కనుక రెండు పార్టీలలో టికెట్స్ ఆశించేవారి సంఖ్య చాలానే ఉంది.
ఇక చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని టిడిపి భావిస్తుండగా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని జనసేన భావిస్తోంది. అయితే ముఖ్యమంత్రి పదవి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకొందనే దానిని బట్టే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకొంటున్నానని పదేపదే చెపుతున్నారు. కనుక జనసేన పోటీ చేయాలనుకొంటున్న సీట్లన్నీ ఇవ్వాలని పట్టుబట్టవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణ, గుంటూరు, ఉత్తరాంద్ర, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో తమకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పట్టుబట్టవచ్చు.
కానీ అవన్నీ టిడిపికి మంచి పట్టు ఉన్న జిల్లాలే. కనుక చంద్రబాబు నాయుడు తమ నేతలను కాదని జనసేనకు అన్ని టికెట్స్ ఇవ్వలేరు. ఒకవేళ ఇస్తే టిడిపి నేతలు నష్టపోతారు. ఇవ్వకపోతే జనసేన నేతలు నష్టపోతారు.
రెండు పార్టీలు ఎలాగో సీట్ల సర్దుబాట్లు చేసుకొన్నా ఆ స్థానాల నుంచి పోటీ చేస్తామనే నమ్మకంతో ఇంతకాలం భారీగా ఖర్చు పెడుతున్న నాయకులు ఆర్ధికంగా నష్టపోతారు. కనుక వారి ఆగ్రహాన్ని భరించడం రెండు పార్టీలకు కూడా కష్టమే.
దీనిని వైసీపి తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు తప్పక ప్రయత్నిస్తుంది. కనుక అది మరో పెద్ద ఇబ్బంది అవుతుంది.
కనుక ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం రెండు పార్టీలకు పెద్ద అగ్నిపరీక్ష కాబోతోందని చెప్పవచ్చు. మరి టిడిపి, జనసేనలు, వాటి నాయకులు ఏవిదంగా ఈ సమస్యను పరిష్కరించుకొంటారో?






