ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండాలని కోరుకొంటారని అందరూ ఆశిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘జరుగబోయేది కురుక్షేత్ర మహాయుద్ధం’ అంటారు… ‘రెండున్నర లక్షల మంది వాలంటీర్లు నా సైన్యం’ అంటారు… ‘మన రాజకీయ శత్రువులు ఫలానా వారు… ఫలానా మీడియా వాళ్ళు కూడా మన శత్రువులే’ అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రతీ సభలో చెపుతుంటారు.
కోట్ల రూపాయల ప్రజాధనంతో ‘సిద్ధం’ అంటూ పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు ముద్రింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రోడ్డులో పెట్టించారు. అది ప్రతిపక్షాలకు ‘ప్రమాద హెచ్చరిక’ వంటిదే అని వేరే చెప్పక్కరలేదు.
సిఎం జగన్ శత్రువుల జాబితా ప్రకటించేసి అందరూ ‘చొక్కా మడత పెట్టి’ యుద్ధానికి ‘సిద్దం’ కావాలని నొక్కి చెపుతున్నప్పుడు వాలంటీర్లు, వైసీపి అక్షౌహిణుల సైన్యం చేతులు ముడుచుకుని కూర్చోదు కదా?ముఖ్యమంత్రి ఆదేశం మేరకు వారు చొక్కా మడత పెడుతుంటే పోలీసులకు వారిని వద్దని అడ్డుకోగలరా?
సాక్షాత్ ముఖ్యమంత్రి వాలంటీర్లు నా సైన్యంలా ఎన్నికలలో పనిచేయాలని స్పష్టంగా చెప్పిన మాటలు ఈసీకి వినబడలేదు కానీ మంత్రి ధర్మానకు వినబడ్డాయి. అందుకే వాలంటీర్లను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “మీకు ఏ సర్వీసు రూల్స్ వర్తించవు. కనుక వృద్దులు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లను మీరే స్వయంగా నింపేసి వారి చేత వైసీపికి ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలి. అలాగే ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లలో వైసీపి ఏజంట్లుగా ‘బాధ్యతలు’ నిర్వహించాలని,” మంత్రి ధర్మాన చాలా స్పష్టంగా చెప్పారు.
ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని ఈసీ చెపుతుంటే, ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం మీ చేతుల మీదుగా మనకి అనుకూలంగా జరగాలని సూచిస్తున్నారు. ఎన్నికలలో ప్రతిపక్షాలు దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తాయని వాటికి ఆ అవకాశం ఇవ్వకూడదని మంత్రి ధర్మాన చెప్పడం చూస్తే ఆ దొంగ ఓట్లు మనకి మనమే వేసుకోవాలని హితవు చెపుతున్నట్లే ఉంది.
వైసీపిలోని ఈ ‘చొక్కా మడత’లని, దొంగ ఓట్ల ఎత్తుగడలని చంద్రబాబు నాయుడు ఏనాడో పసిగట్టారు. అందుకే ఆ మడతని ఇస్త్రీ చేసి సరిచేయాలంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమీషన్‌ల సహాయసహకారాలు తప్పనిసరి అని గ్రహించారు.
పవన్ కళ్యాణ్ కూడా వైసీపి ‘చొక్కా మడత’ని సరిచేయడానికి బీజేపీ కూడా తమతో కలవాలని చాలా ఒత్తిడి చేయవలసి వచ్చిందని స్వయంగా చెప్పారు.
మేము చొక్కా మడత పెడితే తట్టుకోలేరు… అందుకే బీజేపీతో పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రాకులాడుతున్నారని వైసీపి నేతలు స్వయంగా సగర్వంగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. కనుక టిడిపి, జనసేనల ఆందోళనకి అర్దం, పరమార్ధం రెండూ ఉన్నాయని భావించవచ్చు.






