lokesh-nara

ఇది వరకు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌’ అని పార్టీ నాయకుల చేత అనిపించేవారు. కానీ మళ్ళీ రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకొని ఆ ప్రచారానికి ఆయనే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ ఆ ప్రచారంతో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అనే భావన పార్టీలో అందరికీ, ప్రజలకు, చివరికి ప్రతిపక్షాలకు, మీడియాకు కూడా కలిగించగలిగారు.

కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రులు, నేతలు కూడా ‘నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలి.. కాబోయే ముఖ్యమంత్రి ఆయనే..’ అని చెపుతుండటం కూడా అటువంటి ప్రయత్నమేనా?అనే సందేహం కలుగుతుంది.

Also Read – తండేల్ కాంబోస్..!

నారా లోకేష్‌ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు కోరుకోవడం సహజమే. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తికాక ముందే ఇటువంటి సున్నితమైన అంశంపై బహిరంగంగా ఎవరికి తోచిన్నట్లు వారు మాట్లాడుతుండటం కూటమికి చాలా ప్రమాదకరం.

జగన్‌ మెప్పు కోసం వైసీపీ మంత్రులు పోటీలు పడిన్నట్లే, ఇప్పుడు టీడీపీ నేతలు కూడా సిఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ మెప్పు కోసం పోటీలు పడుతూ తమ విధేయతని నిరూపించుకునే ప్రయత్నంలో ఈవిదంగా మాట్లాడుతున్నారనిపిస్తుంది.

Also Read – జగన్‌ 2.0 కోసం కార్యకర్తలు జైళ్ళకి వెళ్ళాలా?

లేదా ఈ అంశంతో అందరి దృష్టిని బాగా ఆకర్షించవచ్చు కనుక రాజకీయంగా మరింత గుర్తింపు సంపాదించుకొని పార్టీలో మిగిలిన నేతల కంటే ముందుకు దూసుకుపోవాలని ఆరాటపడుతున్నారేమో?

కానీ ఇటువంటి మాటలు ఇటు బీజేపి, జనసేనలకు, అటు ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుందని మరిచిపోతున్నారు.

Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?

టీడీపీ నేతల అత్యుత్సాహం వలన బీజేపి, జనసేనలలో అభద్రతాభావం లేదా అసహనం మొదలైతే ఏమవుతుందో ఊహించుకోవచ్చు.

కూటమిలో చిచ్చు రగిలించాలని విఫల యత్నాలు చేస్తున్న వైసీపీకి, టీడీపీ నేతలే కూటమిలో అగ్గి రగిలించి అందిస్తే దానిని కార్చిచ్చుగా మార్చి కూటమిని భస్మం చేయకుండా ఊరుకుంటుందా?

సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ ముగ్గురూ అమరావతి, పోలవరం నిర్మాణం, రాష్ట్రాభివృధ్ది, పరిశ్రమలు, మౌలికవసతుల అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేస్తుంటే, కూటమి ప్రభుత్వం తమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని ప్రజలు సంతోషిస్తున్నారు.

కానీ టీడీపీ నేతలు మాట్లాడుతున్న ఈ మాటలు వింటున్న ప్రజలు, కూటమి ప్రభుత్వం అప్పుడే దారి తప్పుతొందేమిటి?అనే భావన కలుగుతుంది. ప్రజలలో మళ్ళీ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.




కనుక సిఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్‌ ముగ్గురూ కూడా తక్షణమే తమ పార్టీల నేతలను కట్టడి చేయడం చాలా మంచిది.. చాలా అవసరం కూడా!