టిడిపి, జనసేనలు ఇంకా ఉమ్మడి కార్యాచరణ ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడం ప్రారంభించారు.
అయితే జనసేనతో ఇంకా పొత్తులోనే ఉన్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పుకొంటున్నప్పటికీ, ఢిల్లీ నుంచి ఇంకా ‘గ్రీన్ సిగ్నల్’ రానందున ఇంతవరకు రెండు పార్టీలు కలిసి పోరాడింది లేదు.
నిజానికి ఆమె చాలా ఉత్సాహంతో పార్టీ పగ్గాలు చేపట్టారు. రాగానే వైసీపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కూడా. కానీ బీజేపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించకుండా మౌనంగా ఉండిపోవడం ద్వారా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు సంకేతం ఇస్తోంది. కనుక అధిష్టానం జగన్ వైపు మొగ్గుచూపుతుంటే, రాష్ట్రంలో బీజేపీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సరికాదు. బహుశః అందుకే ఆమె కూడా సైలంట్ అయిపోయారనుకోవచ్చు.
బీజేపీ వైఖరి స్పష్టమయ్యింది కనుక జనసేన బీజేపీతో పొత్తులు తెంచుకొని టిడిపి, వామపక్షాలతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చేసింది. అవి కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేస్తే గెలిచి అధికారంలోకి రాగలవని, కానీ అవి బీజేపీని కూడా కలుపుకొంటే ఓడిపోతాయని మళ్ళీ వైసీపియే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని తాజా సర్వేలో తేలింది.
చంద్రబాబు నాయుడు మూడు వారాలుగా జైల్లో ఉన్నప్పటికీ మోడీ, అమిత్ షాలు స్పందించనప్పుడు, టిడిపి, జనసేనలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నాక ఇంకా వారి నిర్ణయం కోసం అవి ఎదురుచూస్తుండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి.
1. తామంతట తాము బీజేపీని కాదనుకొంటే మోడీ, అమిత్ షాలు జగన్‌ను గెలిపించేందుకు, తమను అడ్డుకొనేందుకు చక్రం తిప్పుతారేమో? అని సందేహిస్తుండవచ్చు.
2. ఎలాగైనా బీజేపీతో దోస్తీ కుదిరితే కేంద్రం సాయంతో వైసీపిని సులువుగా కట్టడి చేసి ఎన్నికలలో విజయం సాధించవచ్చని భావిస్తుండవచ్చు.
3. పవన్ కళ్యాణ్ వెనుక మోడీ, అమిత్ షాలు ఉన్నందునే జగన్ ఆయన జోలికి పోవడం లేదని అందరికీ తెలుసు. కనుక ఎన్నికల వరకు ఆ ‘రక్షణ కవచం’ అవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తుండవచ్చు.
అయితే ఈ మూడు స్తంభాలట వలన బీజేపీ కొత్తగా నష్టపోయేదేమీ లేదు కానీ టిడిపి, జనసేనలు మాత్రం విలువైన సమయాన్ని నష్టపోతున్నాయని చెప్పక తప్పదు. పొత్తుల విషయంలో టిడిపి, జనసేనల సందిగ్ధత ప్రజలకు చాలా అసహనం కలిగిస్తోంది.
అదే సమయంలో వైసీపి ఒంటరిగా పోటీ చేస్తుందని చాలా ఖరాఖండీగా చెపుతున్నందున, ప్రజలు మళ్ళీ దాని వైపు మొగ్గే అవకాశం పెరుగుతుంటుంది.
టిడిపి, జనసేనలు కలిసి పనిచేయడం ఖాయమని తేలిపోయింది కనుక బీజేపీ అధిష్టానం కూడా వాటిని ఎన్నికల వరకు ఈ సందిగ్ధంలోనే కొనసాగిస్తూ దెబ్బ తీయవచ్చు.
కనుక టిడిపి, జనసేనలు ఎంత త్వరగా ఈ మాయలో నుంచి బయటపడితే అంతా వాటికే మంచిదని వామపక్షాలు కూడా సూచిస్తున్నాయి.



