ఎవరు ఓడిపోయినా రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి… ఎందువల్ల?

Chandrababu-Naidu-Pawan-Kalyan-Jaganఒకప్పుడు తమిళనాడులో జయలలిత, కరుణానిధిల మద్య అధికారం బదిలీ అయినప్పుడు, అధికారంలోకి వచ్చినవారు తమ ప్రత్యర్ధిని వేధించి, కక్ష సాధించేవారు. వారిద్దరూ జీవించి ఉన్నంతకాలం ఇలాగే పరస్పరం వేధించుకొనేవారు. జయలలిత మరణించిన తర్వాత ఆమె స్థానంలోకి శశికళ ప్రవేశించగలిగి ఉంటే నేటికీఆ విష సంస్కృతిని కొనసాగిస్తూ ఉండేవారు.

కానీ కారణాలు ఏవైతేనేమీ ఆమె రాజకీయాలకు దూరం కావడం, కరుణానిధి వారసుడుగా వచ్చిన ఆయన కుమారుడు స్టాలిన్ ఈ విషసంస్కృతిని కొనసాగించడానికి ఇష్టపడకపోవడంతో దానికి బ్రేక్ పడి, తమిళనాడు రాజకీయాలు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొన్నాయి.

ADVERTISEMENT

అయితే తమిళనాడు విడిచిపెట్టిన ఆ విషసంస్కృతిని, ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అందిపుచ్చుకొని అంతకంటే దారుణంగానే అమలుచేస్తుండటంతో, దానికి గత 4 ఏళ్ళుగా టిడిపి, జనసేనలు మూల్యం చెల్లించుకొంటున్నాయి.

వైసీపీ వేధింపులు భరించలేక కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోగా, గంటా శ్రీనివాసరావు, నారాయణ వంటి కొంతమంది ‘సైలంట్ మోడ్’లోకి వెళ్లిపోయారు. ఇక కేశినేని నాని, జేసీ దివాకర్ రెడ్డివంటి కొందరు వ్యాపారాలు మానేసుకొన్నారు. ఒకానొక దశలో ఏపీలో టిడిపి పని అయిపోయిందనే అనిపించింది.

కానీ ఇటువంటి సవాళ్ళను ధైర్యంగా స్వీకరించి ఎదుర్కొనే సత్తా, నేర్పు, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు స్వయంగా పూనుకొని మళ్ళీ అందరికీ ధైర్యం చెప్పి గట్టిగా పోరాటం మొదలుపెట్టడంతో రాష్ట్రంలో టిడిపి పుంజుకొంది. తాము అధికారంలోకి వస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా అవినీతికి, అరాచకాలకు పాల్పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై కటినమైన చర్యలు తీసుకొంటామని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ తదితరులు హెచ్చరిస్తున్నారు. అలాగే తమ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్న పోలీస్ అధికారులను, అవినీతికి తోడ్పడుతున్న ఉన్నతాధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.

అయితే వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉన్నందున వారి ఆక్రోశాన్ని, ఆర్తనాధాలను విని ఆనందిస్తోంది. ఒకవేళ ఏపీలో వైసీపీ మళ్ళీ మరోసారి అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రంలో టిడిపి, జనసేనలు మనుగడ సాగించలేని పరిస్థితి రావచ్చు. కనుక వచ్చే ఎన్నికలు వాటికి జీవన్మరణ సమస్య కనుక ఎట్టి పరిస్థితులలో గెలిచేందుకు ప్రయత్నిస్తాయి. అప్పుడు అవి కూడా వైసీపీపై ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చు.

ఒకవేళ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజాస్వామ్యానికి, నైతిక విలువలకు కట్టుబడి పాలన సాగిస్తుంటే, వైసీపీకి ఇటువంటి సమస్యలు వచ్చి ఉండేవి కావు. వైసీపీ పాలన, అభివృద్ధి ప్రజలకు నచ్చకపోతే, మహా అయితే ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షంలోకి మారేవారు అంతే. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నందున వారు కూడా భవిష్యత్‌లో ఇటువంటి సమస్యలను ఎదుర్కోకతప్పదు.

కనుక ఒకవేళ వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి ఏర్పడవచ్చు. బహుశః ఈ విషయం వైసీపీ నేతలకు ఇది బాగా తెలిసే ఉంటుంది. కనుక వారికి కూడా వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్యగానే మారాయి. ఇది స్వయంకృతమే కనుక వారు కూడా పోరాటానికి, ఓడిపోతే పర్యవసనాలకు సిద్దపడాల్సిందే తప్పదు!

ADVERTISEMENT
Latest Stories