స్టిక్కర్స్‌తో ఓట్లు రాలితే టిడిపి, జనసేనలు కూడా అంటిస్తున్నాయిగా?

TDP_Janasena_YSRCP_Stickersపరిపాలనా బాధ్యతలు నిర్వహించాల్సిన మంత్రులు, ప్రజా సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవలసిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ వైసీపీ బ్యాగులు భుజాలకి తగిలించుకొని ఇంటింటికీ వెళ్ళి “మా నమ్మకం నువ్వే జగనన్నా” స్టిక్కర్స్ అంటిస్తుండటం చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు.

‘మా నమ్మకం నువ్వే జగనాన్నా అని ప్రజలు అంటే బాగుంటుంది కానీ మనకి మనమే అనుకొంటే ఏం ప్రయోజనం?’ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేల వెంట తిరుగుతున్న వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుకొంటున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు కూడా ఈ కార్యక్రమంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

ఓ వైసీపీ అభిమాని స్పందిస్తూ, “వైసీపీని, జగనన్నను ఎంతగానో అభిమానించే నాకే ఇది చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. ఇక సామాన్య ప్రజలు, న్యూట్రల్ ఓటర్లు, టిడిపి, జనసేన, ఇతర పార్టీలను అభిమానించేవారు ఈ జగనన్న స్టిక్కర్లపట్ల ఏవిదంగా స్పందిస్తారో ఊహించలేమా? డబ్బు కోసం ఐ-ప్యాక్ గాళ్ళు ఇటువంటి పనికిమాలిన సలహాలు ఏవో ఇస్తే వాటిని గుడ్డిగా పాటించేయడమేనా? వైసీపీలో సీనియర్లైనా చెప్పక్కరలేదా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో అభిమాని స్పందిస్తూ, “2014 ఎన్నికలప్పుడు వాళ్ళ (ఐప్యాక్) వ్యూహాలు చూసినప్పుడు నాకూ ఇలాగే అనిపించింది. కానీ 2019లో వైసీపీని గెలిపించారు. కనుక ఇదీ ఫలిస్తుందని ఆశిద్దాం బ్రో,” అని అన్నారు.

“2019 ఎన్నికలలో వైసీపీ కార్యకర్తలే పార్టీ జెండాని భుజం మీద వేసుకొని గెలిపించారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా బ్రో?” అని ప్రశ్నించారు.

మరో అభిమాని స్పందిస్తూ,” అవును బ్రో… ఇళ్లకు స్టిక్కర్స్ అంటించడం చాలా చెత్త కార్యక్రమం. ఇప్పటికే మన జగనన్న నవ్వులపాలవుతున్నాడు. దీంతో ఇంకా చులకన అవుతాడు. మన మంత్రులు, ఎమ్మెల్యేల పరువు కూడా పోతుంది” అని అన్నారు.

మరో అభిమాని స్పందిస్తూ, “టిడిపి ప్రచారం వలన వైసీపీ పట్ల ప్రజలలో నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడింది. కనుక ప్రజలలో ఆ భావన పోగొట్టాలంటే మనం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అవసరం,” అని అన్నారు.

మరో అభిమాని స్పందిస్తూ, “ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేసుకొంటూ నవ్వులపాలవడం కంటే గ్రామస్థాయి వరకు ప్రజలలోకి వెళ్ళగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది,” అని అన్నారు.

ఇక వైసీపీకి పోటీగా జనసేన, టిడిపిలు కూడా వాటి పక్కనే స్టిక్కర్లు అంటించడం మొదలుపెట్టాయి. “మాకు నమ్మకం లేదు జగన్‌… మా నమ్మకం పవన్” అంటూ జనసేన, “మాకు చంద్రన్న ఇచ్చిన పసుపు-కుంకుమ సంక్షేమ పధకం కింద రూ.10,000 నేరుగా మా బ్యాంక్ ఖాతాలో జమా అయ్యాయి,” అంటూ టిడిపి స్టికర్స్ అంటిస్తున్నాయి.

ఒకవేళ వైసీపీ స్టిక్కర్స్ చూసి ప్రజలు ఆ పార్టీకే ఓట్లు వేస్తారనుకొంటే, టిడిపి, జనసేనలు కూడా స్టిక్కర్స్ అంటిస్తున్నాయి కదా?అంటే వైసీపీ అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు ఇదంతా వృధా ప్రయాసే అని అర్దమవుతోంది. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకొన్నది దీనికోసమేనా?

ADVERTISEMENT
Latest Stories