టిడిపి, జనసేనల సమన్వయకమిటీ సమావేశంలో ఉమ్మడి మ్యానిఫెస్టోపై ఏకాభిప్రాయానికి వచ్చామని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు చెప్పారు. త్వరలోనే ఉమ్మడి మ్యానిఫెస్టోని ప్రకటిస్తామని చెప్పారు. ఈ నెల 14,15,16 తేదీలలో నియోజకవర్గం స్థాయిలో రెండు పార్టీల నేతల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై ప్రతీ 15 రోజులకు ఓసారి సమన్వయకమిటీ సమావేశాలు నిర్వహించుకొంటూ ఉమ్మడి కార్యాచరణ ప్రకారం పనిచేస్తామని చెప్పారు.
ఏ పార్టీ సిద్దాంతాలు, ప్రయోజనాలకు అనుగుణంగా అవి తమ మ్యానిఫెస్టోని రూపొందించుకోవడం సులువే కానీ భావస్వారూప్యత ఉన్నప్పటికీ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోని రూపొందించుకోవడం చాలా కష్టమే. టిడిపి, జనసేనలు పరస్పర అవగాహనతో ఉమ్మడి మ్యానిఫెస్టోని రూపొందించుకొంటుండటం చాలా అభినందనీయమే.
అయితే మ్యానిఫెస్టో కంటే అత్యంత క్లిష్టమైనది సీట్ల సర్దుబాట్లు! రెండు పార్టీలలో అనేకమంది నేతలు తమకే తప్పక టికెట్ లభిస్తుందనే గట్టి నమ్మకంతో చాలా కాలంగా తమ తమ నియోజకవర్గాలలో పనిచేసుకొంటున్నారు. ఈరోజుల్లో ఫ్లెక్సీ బ్యానర్ ముద్రించాలన్నా, చిన్న ర్యాలీ లేదా నిరసన దీక్ష చేపట్టాలన్నా దాని ఏర్పాట్లకు భారీగానే ఖర్చవుతుందని అందరికీ తెలుసు.
ఇక పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, అధినేతలు పర్యటించినప్పుడు ఏర్పాట్లకు ఇంకెంత ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చు. టికెట్ లభిస్తుందనే నమ్మకంతోనే నేతలు ఆ ఖర్చులు భరిస్తుంటారు. టిడిపి, జనసేన నేతలు కూడా ఇదే నమ్మకంతో పనిచేస్తున్నారు.
టిడిపి, జనసేనలు దేనికవి పోటీ చేస్తే వారందరికీ ఖచ్చితంగా టికెట్స్ లభిస్తాయి. కానీ పొత్తులు పెట్టుకొన్నాయి కనుక సీట్ల సర్దుబాట్లు అనివార్యం. అప్పుడు ఓ పార్టీ నేతకు టికెట్ ఇస్తే మరో పార్టీ నేత నష్టపోక తప్పదు. తెలంగాణలో మొదట 32 స్థానాలలో పోటీ చేయాలనుకొన్న జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నాక 8 సీట్లకే పరిమితం కావడమే ఇందుకు తాజా ఉదాహరణ.
కనుక ఏపీలో టిడిపి, జనసేనలకు కూడా అటువంటి ఇబ్బందులు, త్యాగాలు అనివార్యమే. కనుక వీలైనంత త్వరగా రెండు పార్టీలు సీట్ల సర్దుబాట్లు చేసుకొంటే, టికెట్ ఆశించి పనిచేస్తున్న అభ్యర్ధులకు స్పష్టత వస్తుంది. వారికి ఏవిదంగా న్యాయం చేయగలమో రెండు పార్టీలు నచ్చజెప్పుకొనేందుకు తగినంత సమయం కూడా ఉంది.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఇదే విదంగాచేసి పార్టీలో అసంతృప్త నేతలందరినీ బుజ్జగించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్ధులను ప్రకటించడంలో ఆలస్యం చేయడం వలన నామినేషన్లకు చివరిరోజైన నేటి వరకు కూడా టికెట్ లభించని అసంతృప్త నేతలతో సతమతమవుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కనుక టిడిపి, జనసేనలు వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాట్లు చేసుకొని అభ్యర్ధులను ప్రకటించడం చాలా మంచిది. కాదని ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాట్లు చేసుకొందామనుకొంటే అప్పుడు రెండు పార్టీలలో టికెట్ లభించనివారి అలకలు, రాజీనామాలు వైసీపికి వరంగా మారుతాయి.






