శాసనసభ ఎన్నికలలో వైసీపీ ఓడిపోగానే ఆ పార్టీ పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే పలువురు వైసీపీ నేతలు తమ కలుగుల్లో మౌనంగా ఉండిపోగా, జగన్ అండ చూసుకొని పేట్రేగిపోయిన పలువురు ‘ఇకపై రాజకీయాలు చేయము’ అంటూ లెంపలు వేసుకున్నారు.
ఆ తర్వాత తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ పరువు పూర్తిగా పోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హెచ్చరికతో వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా యోధులపై కేసులు నమోదవడం మొదలయ్యాయి. పోనీ ఢిల్లీకి వెళ్ళి మోడీ కాళ్ళ మీద పడదామంటే అపాయింట్ మెంట్ లభించడం లేదు.
ఇటువంటి పరిస్థితులలో మరొకరైతే చేతులు ఎత్తేసేవారే. కానీ జగన్ ఆ కోవకి చెందిన రాజకీయ నాయకుడు కారు. ఆయన విధ్వంసపాలకుడే కావచ్చు కానీ పిరికివాడు మాత్రం కాదు.
అందుకే పార్టీ నేతలు ఒకరొకరుగా జైలుకి పోయి వస్తున్నా ఏమాత్రం భయపడకుండా మిగిలినవారిని ఉత్తేజపరుస్తూ పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకొస్తున్నారు.
2027 లో జమిలి ఎన్నికలు వస్తాయని, అప్పుడు మళ్ళీ మనమే తప్పక గెలిచి అధికారంలోకి వస్తామని అంతవరకు అందరూ ధైర్యంగా పోరాడాలని జగన్ ధైర్యం చెపుతున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంతకంటే భయంకరమైన పరిస్థితులే ఎదుర్కొన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వారికి ఇలాగే ధైర్యం చెపుతూ పార్టీని కాపాడుకుంటూ ఎన్నికలలో గెలిపించుకొని అధికారంలోకి రాగలిగారు.
కనుక జగన్ కూడా ఇప్పుడు అంతే ధైర్యంగా పోరాడుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఆయనలో ఇంత ఆత్మవిశ్వాసం ఉంది కనుకనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలు “జైలుకి వెళ్ళేందుకు భయపడేదేలే.. జైల్లో ఉన్నా బయట ఉన్నా కూటమి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటానని” చెపుతున్నారు.
ఇదివరకు రోజా మంత్రిగా ఉన్నప్పుడు నెలకు 3-4 సార్లు తిరుమలకి వెళ్ళి వచ్చేవారు. కానీ ఓటమి తర్వాత ఒక్కసారి మాత్రమే వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి వెళ్ళి చాలా ధైర్యంగా మాట్లాడారు.
అంటే కూటమి ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఏమీ కాదని, జగన్‌లాగే బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేయగలమనే నమ్మకం, ధైర్యం వారికి కలిగినట్లే ఉంది. వైసీపీ నేతల్లో ఈ ధైర్యం ఉన్నప్పుడు వారిని కూటమి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు.
ఇక కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే ఎంతసేపు ‘జగన్ హయాంలో అంత అవినీతి జరిగింది.. ఇంత జరిగింది.. అక్కడ భూములు కొట్టేశారు.. ఇక్కడ కొట్టేశారు’ అంటూ కధలు కధలుగా చెప్పుకోవడం చూసి, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
“వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది కనుకనే మిమ్మల్ని ఎన్నుకున్నాము కదా?వారిపై చర్యలు తీసుకోకుండా వారి అవినీతి స్టోరీలు మాకు వినిపించడం దేనికి?ఇంతవరకు వైసీపీ నేతల నుంచి ప్రభుత్వం ఒక్క ఎకరం తిరిగి స్వాధీనం చేసుకుందా? ఒక్క రూపాయి రాబట్ట గలిగిందా? ఒక్క నేరానికి శిక్షించగలిగిందా?”అని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేయోభిలాషులే ప్రశ్నిస్తున్నారు.
కనుక “గత 5 ఏళ్ళ అవినీతిని వెలికి తీసి కేసులు పెడుతూ కాలక్షేపం చేయడమే కాదు తిన్నదంతా తిరిగి కక్కించాలి కూడా…“ అని టీడీపీ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. అదంత తేలిక కాదు కానీ చేసి చూపిస్తే ప్రభుత్వ సమర్దత ఏపాటిదో ప్రజలకు కూడా అర్దం అవుతుంది కదా?




