గత నాలుగేళ్ళుగా మోడీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఎంత ఉదారంగా అంటే… రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలిసి ఉన్నా విస్మరించే అంత! వివేకాహత్య కేసులో సీబీఐనే బెదిరిస్తున్నా మౌనం వహించే అంత! ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిపూజ చేసిన అమరావతిని కాదంటున్నా పట్టించుకోనంత!అప్పులతో ఏపీ మునిగిపోతోందని తెలిసి ఉన్నా, కేంద్రం ఇస్తున్న నిధులు దారి మళ్ళుతున్నాయని తెలిసినా మౌనం వహించే అంత!
అయితే మరో 9 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఢిల్లీ పెద్దలు వైసీపీ పట్ల బిజెపి విధానాన్ని పునః సమీక్షించుకొన్నాక, అమిత్ షా విశాఖకు వచ్చి వైసీపీని తమ రాజకీయ శత్రువుగా ప్రకటించి వెళ్ళారు.
అయితే నేటికీ వైసీపీతో లోపాయికారిగా స్నేహం చేయదలిస్తే బిజెపియే నష్టపోతుంది. అది వేరే విషయం. కానీ వైసీపీ పట్ల తమ వైఖరి మారిందని బిజెపి అధిష్టానం స్పష్టం చేసింది కనుక తదనుగుణంగా చర్యలు చేపడుతోంది.
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి సానుభూతిపరుల ఓట్లు గల్లంతు చేస్తూ, వారి స్థానంలో భారీగా దొంగ ఓటర్లను జగన్ ప్రభుత్వం నమోదు చేయిస్తోందని, అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకె మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఆయన స్పందించిన్నట్లు లేదు.
ఈ విషయం కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి వెళ్ళడంతో ఆయనను ఢిల్లీకి పిలిపించి వివరణ కోరింది. ఇదివరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలోనే ఆయా జిల్లాలలో భారీగా దొంగ ఓటర్లు నమోదు అయిన్నప్పుడు టిడిపి నేతలు పదేపదే ఎన్నికల అధికారులను కలిసి పిర్యాదులు చేశారు. కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా సంబందిత అధికారులు, పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు.
అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తోంది. కనుక కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా ఏపీలో ఓట్లు గల్లంతు, దొంగ ఓట్ల నమోదుపై దృష్టి సారించినట్లుంది. కనుకనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకె మీనాను పిలిపించి సంజాయిషీ కొరిన్నట్లు భావించవచ్చు.
కనుక వైసీపీ నేతలు కూడా తమ ప్రభుత్వం పట్ల కేంద్రం వైఖరి మారిందని, ఒకవేళ తాము చిక్కుల్లో పడితే ఏ అన్న వచ్చి కాపాడడని గ్రహిస్తే వారికే మంచిది.



