టిడిపి నేతలు శనివారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బయలుదేరగా దారిలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా, పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, ఇంకా పలువురు టిడిపి నేతలు ఈరోజు ఉదయం ఏలూరు నుంచి గోపాలాపురం మీదుగా పోలవరానికి బయలుదేరారు. వారందరినీ కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకోవడం వారి మద్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి.
Also Read – సమంతకు గుడి కట్టిన అభిమానం
ప్రజాధనంతో ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును ప్రతిపక్ష నేతలు చూసేందుకు బయలుదేరితే ఎందుకు అడ్డుకొంటున్నారని వారు పోలీసులను ప్రశ్నించారు. అసలు తమను అరెస్ట్ చేయడానికి కారణం చెప్పాలని వారు గట్టిగా నిలదీశారు. పోలవరం ఆంధ్రా రాష్ట్రంలోనే ఉందా లేక పాకిస్తాన్‌లో ఉందా? తాము ఉగ్రవాదులం కాదు కదా? మరెందుకు అడ్డుకొంటున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు.
కానీ పోలీసులు వారికి సమాధానం చెప్పకుండా అందరినీ బలవంతంగా జీపులలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే దేవినేని ఉమ వారి నుంచి తప్పించుకొని టిడిపి కార్యకర్త బైక్‌పై కూర్చొని పోలవరం చేరుకోగా, అప్పటికే అక్కడ కాపుకాస్తున్నపోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.
Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కాలినడకన పోలవరానికి బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డుకొన్నారు. ఎమ్మెల్యేగా తనకు అక్కడకు వెళ్ళేందుకు అధికారం ఉందని కానీ పోలీసులు ఎందుకు అడ్డుకొంటున్నారని నిమ్మల ప్రశ్నించారు. నాలుగేళ్ళుగా పోలవరంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూడాలని బయలుదేరుతున్నాము కానీ అక్కడకి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడం చూస్తే అక్కడ ఏదో చాలా పెద్ద గోల్‌మాల్ జరుగుతునట్లు అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులను, ప్రజలను తీసుకువెళ్ళి పోలవరంలో జరుగుతున్న పనులను చూపించేవారమని, కానీ జగన్ ప్రభుత్వం అక్కడకు ఎవరూ వెళ్ళకుండా ఎందుకు అడ్డుకొంటోందో చెప్పాలని నిమ్మల పోలీసులను నిలదీశారు. అయితే పోలీసులు ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు కనుక బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
పోలవరం ప్రాజెక్టుని ప్రతిపక్ష నేతలు చూస్తే ఏమవుతుంది?అంటే వారు తమ దృష్టికి వచ్చిన లోపాలను లేదా అవకతవకల గురించి మీడియాతో మాట్లాడుతారు. అంతమాత్రన్న రాష్ట్ర ప్రజలు వారి మాటలను గుర్తుపెట్టేసుకొని ఎన్నికలలో వైసీపీ ఓడించేయరు కదా? వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నట్లు నిజంగా అక్కడ శరవేగంగా పనులు జరిగిపోతుంటే, ప్రభుత్వమే ప్రతిపక్ష నేతలను తీసుకువెళ్ళి చూపించి “ఇవిగో మేము చేసిన చేస్తున్న పనులు….” అని గర్వంగా చూపుకోవచ్చు. కానీ భయపడుతోంది!
కోట్లు ఖర్చు చేసి అక్కడ నిర్మించిన ఓ లైనింగ్ వాల్ క్రుంగిపోయిన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కనుక టిడిపి నేతలను అనుమతిస్తే వారు అక్కడకు వెళ్ళి దాని గురించి మాట్లాడితే ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతోనే అడ్డుకొని ఉండవచ్చు. తద్వారా ప్రభుత్వం ఏదో దాచిపెడుతోందని అంగీకరించినట్లయింది కదా?టిడిపి నేతలకు ఇది చాలదా జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడానికి?
#తెలుగుదేశం హయంలో బస్సులు పెట్టి సామాన్యులకు సైతం పోలవరం నిర్మాణం చూపించేవాళ్ళం – నేడు జగన్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కూడా చూసే పరిస్థితి లేదు.. pic.twitter.com/ucmq3Xihom
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) June 10, 2023