అటవీ అధికారులే ఆ భూములు మావి కావంటే..

 TDP MYDUKUR Incharge Putta Sudhakar Yadavఅటవీశాఖకు చెందిన భూములను అటవీశాఖ అధికారులే కబ్జారాయుళ్ళ నుంచి కాపాడుకోవలసి ఉంటుంది. కానీ అధికార వైసీపీ నేతలతో కుమ్మక్కు అయిన కొందరు అధికారులు, ఆ భూములు అటవీశాఖకు చెందినవి కావని హైకోర్టుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని కడప జిల్లా టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

టిడిపి మైదుకూరు నియోజకవర్గం ఇన్‌ చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం కడప పట్టణంలోని టిడిపి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, “స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి 300 ఎకరాల అటవీభూమిని ఆక్రమించుకొంటున్నారు. మేము దీనిపై అటవీశాఖకు, చెన్నైలోని జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్‌కి కూడా ఫిర్యాదు చేశాము. ఆరు నెలల్లోగా ఆ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని గ్రీన్ ట్రిబ్యూనల్ జిల్లా కలెక్టర్‌ను, అటవీశాఖను ఆదేశించింది. కానీ అటవీశాఖ అధికారులు ఇంతవరకు వాటిని స్వాధీనం చేసుకోకపోగా, ఆ భూములు తమ శాఖకు చెందినవి కావని కోర్టుకు తప్పుడు నివేదికలు సమర్పించారు.

ADVERTISEMENT

రెవెన్యూ అధికారులు కూడా వారికి వంతపాడుతూ ఆ భూములను ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసినట్లు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఒకవేళ జిల్లా కలెక్టర్‌ ఆ భూములను వైసీపీ ఎమ్మెల్యే, అనుచరుల నుంచి స్వాధీనం చేసుకోకపోతే మేము మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి జరిగిన భాగోతం అంతా తెలియజేస్తాము,” అని హెచ్చరించారు.

ఈ పత్రికా సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి వికాస్ హరికృష్ణ, జనార్దన్, బెస్త సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ తదితరులు పాల్గొని వైసీపీ నేతల అక్రమాలను వివరించారు.

ADVERTISEMENT
Latest Stories