టిడిపి గెలుస్తుందని ఎవరో వచ్చి చెప్పాలా… ప్రజా స్పందన చూస్తే అర్దమవుతోందిగా?

Jagan-Chandrababu-Naiduఇండియా టుడే తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏపీలో టిడిపి 15 ఎంపీ సీట్లు గెలుచుకొంటుందని తేల్చి చెప్పింది. అంతకు ముందు మరో సంస్థ వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకొంటుందని చెప్పింది. అయితే ముంజేతి కంకణం చూసుకొనేందుకు అద్దం ఎందుకు?అన్నట్లు ఏపీలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ పర్యటనలకు వస్తున్న అపూర్వ ప్రజాస్పందన చూస్తేనే, ఈసారి ప్రజలు మళ్ళీ టిడిపిని గెలిపించబోతున్నారని అర్దమవుతోంది కదా?

నీరు పల్లమెరుగు అన్నట్లు రాజకీయనాయకులు ఎన్నికలకు ముందు ఏదైనా ఓ పార్టీలోకి క్యూ కడుతున్నారంటే, దానర్దం ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే సూచిస్తున్నట్లు. వైసీపీ నేతలు ఒకరొకరిగా టిడిపిలో క్యూ కడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు కదా?

ADVERTISEMENT

ఇక ఈ సర్వేలను పక్కన పెట్టి జగన్ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, వాటి బలాబలాలు చూసినా అన్నీ టిడిపికే అనుకూలంగా కనిపిస్తున్నాయి.

టిడిపితో జనసేన కలిసే అవకాశం ఉంటే, ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో ఓటర్లు చీలిపోకుండా తమవైపు ఉండేలా చేయగలవు. ఒకవేళ టిడిపి వేరేగా, జనసేన-బిజెపిలు కలిసి పోటీ చేసినా అవి పరస్పరం సహకరించుకొంటాయని వైసీపీ నేతలే చెపుతున్నారు కనుక ఓట్లన్నీ ఆ మూడు పార్టీలు కొల్లగొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం పట్ల ఢిల్లీ పెద్దల వైఖరి కూడా మారిందని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాటలతో అర్దమవుతోంది.

ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు ఏపీ ప్రజలకు జగన్‌ పాలన రుచి తెలియదు. అదీగాక ఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వం చేసుకొన్న కొన్ని తప్పిదాలు, దాని రాజకీయ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై జగన్‌కు పరోక్షంగా సహకరించడం వలన ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగలిగింది.

ఈ నాలుగున్నరేళ్ళలో ఏపీ ప్రజలు జగన్‌ పాలన ఎలా ఉంటుందో ప్రతీ ఒక్కరూ అనుభవపూర్వకంగా తెలుసుకొన్నారు. మూడు రాజధానుల నుంచి విశాఖ రాజధాని వరకు జగన్‌ ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులను చూశారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల ‘నోటి తీట’ని చెవులారా వింటున్నారు.

జీతాలు, పింఛన్, డీఏ బకాయిలు ఇంకా పలు అంశాలపై ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఎవరూ నోరెత్తలేని నిసహాయస్థితిలో ఉన్నారు కనుక అందరూ చాలా ఓపికగా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.

సంక్షేమ పధకాలతో డబ్బు అందుకొంటున్నవారందరినీ నయన్నో భయాన్నో జగన్ ప్రభుత్వం లొంగదీసుకోవచ్చు. కానీ వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్డిస్తున్న ఇంటి పన్ను, చెత్తపన్ను, కరెంటు ఛార్జీల భారాన్ని మోస్తున్న మిగిలిన ప్రజలందరూ తీవ్ర అసహనంతో ఉన్నారుయి. ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరల బాదుడుతో లబ్ధిదారులతో సహా రాష్ట్ర ప్రజలందరూ వేసారిపోయి ఉన్నారు.

కరెంటు బిల్లులు మోత మోగిపోతున్నా కరెంట్ కోతలు తప్పకపోవడంతో సామాన్య ప్రజలు, అటు పారిశ్రామికవేత్తలు అన్ని వర్గాలవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక వారందరూ కూడా ఈ సమస్యలకు ముగింపు కోరుకొంటున్నారు. అంటే వీటిని సృష్టించిన వైసీపీ సరిచేస్తుందని కాదు.. వైసీపీని సాగనంపాలని ఎదురుచూస్తున్నారు.

అందుకే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ పర్యటనలకు అంతగా జనాధరణ వస్తోంది. ఇన్ని సంకేతాలు కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తుంటే, మళ్ళీ ఢిల్లీ నుంచి ఇండియా టుడే వచ్చి సర్వే చేసి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పాలా?

ADVERTISEMENT
Latest Stories