రాష్ట్రంలో టిడిపి నేతలు, కార్యకర్తలు ఓ వైపు ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటాలు చేస్తూనే గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించుకొంటున్నారు.
అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి నియోజకవర్గంలో మంగళవారం టిడిపి మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనిలో నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రస్తుతం మనం అధికార వైసీపీ నుంచి, పోలీసుల నుంచి తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కోవలసివస్తోంది. అయినప్పటికీ మనం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించగలిగాము. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతోందని వాటితో స్పష్టమైంది. అయితే టిడిపిని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకొన్నప్పుడే మళ్ళీ పార్టీకి పూర్వవైభవం, అధికారం సిద్ధిస్తాయి. కనుక మనం అందరం ఇప్పటి నుంచే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ, “ఎన్నికకు ముందు మనం ఓటర్ల జాబితాలను కూడా నిశితంగా పరిశీలించాలి లేకుంటే వైసీపీ ఎంతకైనా తెగించగలదు. మన పార్టీకి ఓట్లు వేస్తారనుకొనేవారి పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించే ప్రయత్నం చేయవచ్చు. కనుక ఈ విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి,” అని అన్నారు.
ఈ సమావేశంలో అనకాపల్లి టిడిపి పార్లమెంట్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు కొలుకులూరి విజయ్ బాబు, ప్రధాన కార్యదర్శి కాండ్రకోట చిరంజీవి, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు గొన్నాబత్తుల నాగేశ్వరరావు (శేషు), మండల అధ్యక్షుడు రాజు, మండల ప్రధాన కార్యదర్శి సన్యాసినాయుడు, సీనియర్ నేత అన్నం వెంకట్రావు, ఐటిడిపి నాయకులు రాజాన వెంకునాయుడు, రాజాన నారాయణమ్మ, మాజీ సర్పంచ్ గెంజి శ్రీను తదితరులు పాల్గొన్నారు.



