ఉపాధ్యాయులకు మంత్రి బొత్స పాఠాలు!

 teachers unions met Education Minister Botsa Satyanarayanaఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇంతకు ముందు సినీ పరిశ్రమను ఓ ఆట ఆడుకొన్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఉపాధ్యాయులతో ఆడుకొంటోంది.

ఉపాధ్యాయులు అందరూ ఉదయం 9 గంటలలోపు పాఠశాలకు చేరుకొని తమ మొబైల్ ఫోన్‌ల నుంచి ‘ఏపీ సిమ్స్’ యాప్ ద్వారా హాజరువేసుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా హాఫ్-డే సెలవుగా పరిగణించి జీతం కోసేస్తామని హుకుం జారీ చేసింది.

ADVERTISEMENT

నిన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో అమరావతిలో ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఇప్పటికే పాఠశాలలలో బయో మెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ ఏపీ సిమ్స్ ఎందుకని ప్రశ్నించారు. ఒక్క నిమిషం ఆలస్యం అయితే హాఫ్-డే జీతం కోసేస్తామని బెదిరించడం ఏమిటని నిలదీశారు. తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్‌ల నుంచి అటెండన్స్ ఎందుకు వేసుకోవాలని ప్రశ్నించారు. ఒకవేళ ఉపాధ్యాయుల వద్ద స్మార్ట్ ఫోన్‌ లేకపోతే, దానికి పాఠశాలల ఆవరణలో ఆ సమయానికి సిగ్నల్ లేకపోతే ఏమి చేయాలని ప్రశ్నించారు. ఒకవేళ మొబైల్ యాప్ ద్వారానే ప్రభుత్వం తమ అటెండన్స్ తీసుకోవాలనుకొంటే ఉపాధ్యాయులు అందరికీ మొబైల్ ఫోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విదానం మీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయగలరా?అని నిలదీశారు.

వారి ప్రశ్నలకు మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేస్తూ, “ఇప్పటికే లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు ఈ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దాని ద్వారా హాజరువేసుకొంటున్నారు. కనుక మిగిలినవారు కూడా తప్పనిసరిగా ఈ విధానాన్ని పాటించాల్సిందే. టీచర్లు అందరికీ మొబైల్ ఫోన్స్ కొనివ్వాలంటే రూ.200 కోట్లు ఖర్చవుతుంది. మళ్ళీ రెండేళ్ళకోసారి ఆ ఫోన్లన్నీ మార్చుతుండాలి. కనుక ఇది సాధ్యం కాదు.

ఉపాధ్యాయులు చేసిన కొన్ని సూచనలు సహేతుకంగా ఉన్నాయి. కనుక ఆ ప్రకారం ఏపీ సిమ్స్ యాప్‌లో అవసరమైన మార్పులు చేయిస్తాము. అలాగే ఒక్క నిమిషం ఆలస్యం నిబందనను పక్కన పెట్టి ఇదివరకులాగే మూడుసార్లు ఆలస్యమైతే హాఫ్-డే జీతం కట్ చేసేవిదంగా యాప్‌లో మార్పులు చేస్తాం. ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్‌లు తెచ్చుకోవడం మరిచిపోతే ఇతర ఉపాధ్యాయుల ఫోన్‌ల నుంచి కూడా హాజరువేసుకొనే వెసులుబాటు కల్పిస్తాం.

ఇంకా ఏమైనా సమస్యలుంటే ఈ నెల 28న మరోసారి సమావేశమయ్యి మాట్లాడుకొందాము. కానీ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయానికి ఉపాధ్యాయులు అందరూ కట్టుబడి ఉండాల్సిందే.,” అని తేల్చి చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు అర్దాంతరంగా సమావేశం నుంచి వెళ్ళిపోయారు. త్వరలోనే ఈ విధానం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అమలుచేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో బాంబు పేల్చారు.

ADVERTISEMENT
Latest Stories