ప్రతిష్టాత్మకమైన 500వ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించేందుకు టీమిండియా అన్ని మార్గాలు సుగమం చేసుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోర్ సాధించిన భారత జట్టు, కివీస్ జట్టుకు 434 పరుగుల టార్గెట్ ను అందించింది. నాలుగవ ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొని అంతటి భారీ స్కోర్ ను అందుకోవడం అసాధ్యం అన్న విశ్లేషణలకు అనుగుణంగానే 56 పరుగులకే 4 కీలక వికెట్లు తీసి, భారీ విజయానికి బాటలు వేసుకుంది.
ఇక, మ్యాచ్ లో ఒకే ఒక రోజు మిగిలి ఉంది. టీమిండియా విజయం కూడా 99 శాతం తధ్యం. మరి మిగిలిన ఒక్క శాతం ఎవరు అడ్డుపడవచ్చు అంటే… అతను మరెవరో కాదు వరుణుడు..! చివరి రోజు వర్షం అడ్డుపడని పక్షంలో భారత జట్టుకు కావాల్సిన 6 వికెట్లను చేజిక్కించుకోవడం కష్టసాధ్యమైన విషయం కాదు. నాలుగవ పడిన 4 వికెట్లలో 3 వికెట్లను సొంతం చేసుకుని అశ్విన్ సూపర్ ఫాంలో ఉండగా, మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన జడేజా కట్టుదిట్టమైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు.
ఇక, నాలుగవ రోజు టీమిండియా బ్యాట్స్ మెన్లు నిలకడైన ఆట తీరుతో మ్యాచ్ ను మొత్తం భారత్ వైపుకు తిప్పేసారు. విరాట్ కోహ్లి ఒక్కడే విఫలం కాగా, మొదటి ఇన్నింగ్స్ లో విఫలమైన రోహిత్ శర్మ కూడా అజేయమైన అర్ధ సెంచరీతో ఫాంను అందుకున్నాడు. రోహిత్ కు తోడుగా నిలిచిన జడేజా కూడా అర్ధ సెంచరీకి చేరువ కాగానే, ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసాడు కోహ్లి. టీమిండియా బ్యాట్స్ మెన్లలో రాహుల్ (38), విజయ్ (76), పుజారా (78), కోహ్లి (18), రహానే (40), రోహిత్ శర్మ (68 నాటౌట్), జడేజా (50 నాటౌట్) పరుగులతో రాణించడంతో 377 పరుగుల భారీ స్కోర్ నమోదైంది.



