తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్ – విపక్ష బిఆర్ఎస్ మధ్య మొదలైన రాజకీయ రణరంగం తో మీడియా అటెన్షన్ మొత్తం ఈ రెండు పార్టీల మధ్య సాగింది. కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతల విమర్శలు, రేవంత్ టార్గెట్ గా బిఆర్ఎస్ శ్రేణుల ప్రతిదాడులు ఇలా గత రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలు మొత్తం ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతున్నాయి.
నువ్వా – నేనా అన్నట్టుగా ఈ ఇద్దరు ఎక్కడ తగ్గేదెలా అంటూ ఒకరి మీద మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాలలో మరో రాజకీయ పార్టీ ఊసు లేకుండా చేస్తున్నాయి. అసెంబ్లీ ప్రాగణం నుంచి ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ వరకు సాగిన ఈ ఇరు పార్టీల రాజకీయం ఇప్పుడు వీడియో కొట్లాటలతో ముందుకు సాగుతుంది.
అధికారులను అడ్డుపెట్టుకుని మా పార్టీ మహిళా నేతల పై కాంగ్రెస్ ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించిందని, మా పార్టీ నాయకుల మీద అధికార పార్టీ దాడులు చేయించిందని, రేవంత్ కలియుగ దుశ్యాసనుడు అంటూ బిఆర్ఎస్ అందుకు బలం చేకూరే వీడియో లను ప్రచారం చేస్తుంటే, ఇక అధికార కాంగ్రెస్ కూడా తమ ఆరోపణలను కూడా వీడియోల రూపంలో బయటకు తీసింది.
అసలు బిఆర్ఎస్ మహిళా నేతలకు ఆ పరిస్థితి వచ్చిందే బిఆర్ఎస్ నాయకుల వల్ల అంటూ ముఖ్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా వీడియో లు రిలీజ్ చేసింది. అలాగే కేసీఆర్ ఇంటి ముట్టడికి వెళ్లిన దళిత నేతలను అవమానించేలా కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రదేశాలను బిఆర్ఎస్ పసుపు నీళ్లతో శుద్ధి చేసిందని, కేసీఆర్ కి దళితులంటే అంత చులకనా అంటూ ఆ వీడియో లను కూడా కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇలా ఇరు పార్టీల నేతల మధ్య మాటలతో మొదలైన రాజకీయ యుద్దాలు కాస్త ఇప్పుడు వీడియో ల రూపంలో నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి.





