మన, తెలంగాణ శాసనసభ సమావేశాలకి ఎంత తేడా?

Telangana Assembly Harish Rao Revanth Reddy

ఏపీ శాసనసభ సమావేశాలు ఏవిదంగా జరుగుతాయో అందరికీ తెలుసు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్దాంగి భువనేశ్వరిపై వైసీపి ఎమ్మెల్యేలు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటే, అందుకు ఆయన బాధపడుతుంటే జగన్మోహన్‌ రెడ్డి ఆనందం పట్టలేక ముసిముసినవ్వులు నవ్వుతుంటారు తప్ప రాజకీయాలతో సంబంధం లేని మహిళల గురించి సభలో తప్పుగా మాట్లాడకూడదని వారించరు.

చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి సభ్యులు రాష్ట్రానికి సంబందించిన వివిద సమస్యలు, వివిద శాఖల గురించి ప్రశ్నలు అడుగుతుంటే సంబందిత మంత్రులు ఎవరూ వాటికి సూటిగా జవాబులు చెప్పకుండా వ్యక్తిగత, రాజకీయ విమర్శలు చేస్తూ చర్చని పక్కదారి పట్టించి తప్పుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

కానీ ఈరోజు తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులపై ఓ వైపు సిఎం రేవంత్‌ రెడ్డి, ఆయన మంత్రులు, మాజీ ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఒక్కరూ మరోవైపు నిలిచి గణాంకాలతో సహా తమ వాదనలు వినిపిస్తుంటే వారి వాదన ఎంతో అర్దవంతంగా ఉంది.

ఈరోజు తెలంగాణ శాసనసభలో జరిగిన ఈ చర్చ ఇటు హరీష్ రావు, అటు కాంగ్రెస్‌ మంత్రులకు వారివారి శాఖలపై సమగ్ర అవగాహన ఉందని నిరూపించింది.

కేసీఆర్‌ హయాంలో చేసిన అప్పులు, వాటితో చేసిన పారిశ్రామిక, సాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధిని హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు. పారిశ్రామికాభివృద్ధితో లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ఆదాయం పెరిగిందని, సాగునీటి రంగంతో వ్యవసాయోత్పత్తి, రైతుల జీవన ప్రమాణాలు ఎంతగా పెరిగాయో హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు.

దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ ఆర్ధికంగా చాలా బలంగా ఉందని, అందుకే పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, పెట్టుబడులువస్తున్నాయని చెప్పారు. ఇంతగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దివాళా తీసిందని ప్రభుత్వమే చెపుతుంటే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు వస్తాయా?

ప్రజలకు మీరిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా తప్పించుకోవడం కోసమే రాష్ట్రం దివాళా తీసిందని అబద్దాలు చెపుతున్నారు. మీ హృదయాలలో తెలంగాణతనం లోపించింది. అందుకే రాష్ట్రం పరువు, ప్రతిష్ట మంటగలిపేస్తున్నారు,” అంటూ హరీష్ రావు పూర్తి గణాంకాలతో సహా తన వాదనలను వినిపిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

కానీ సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు కూడా గణాంకాలతోనే ఆయనాకు ధీటుగా బదులిచ్చారు. “కాళేశ్వరం ప్రాజెక్టు ‘రాబడి గురించి’ మీ ప్రభుత్వం బ్యాంకులకు అబద్దాలు చెప్పి రూ.90 వేల కోట్లు అప్పులు తీసుకొంది. ఇది కాకుండా అంతకు అంత మీ ప్రభుత్వం దానిపై ఖర్చుపెట్టింది. కానీ మీరు మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లు మించలేదని అబద్దం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్లు మీరు అవినీతికి పాల్పడ్డారనడానికి ఇది ఓ నిదర్శనం.

మిషన్ భగీరధ నీటిని ప్రజలకు అమ్ముకొని ఆ వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చుతామని బ్యాంకులకు తప్పుడు సమాచారం ఇచ్చి, బయట ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందిస్తున్నామని చెప్పుకొంటున్న మాట వాస్తవం కాదా? అని సిఎం రేవంత్‌ రెడ్డి నిలదీశారు.

‘కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా తమ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టలేదని’ హరీష్ రావు గొప్పగా చెప్పుకొన్నప్పుడు, ఆర్ధికమంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి జోక్యం చేసుకొంటూ, “నేను ఎంపీగా పనిచేసినప్పుడు ఆ పార్లమెంట్‌ కమిటీలో నేను కూడా సభ్యుడుగా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ రాష్ట్రాల మీద ఆవిదంగా ఒత్తిడి చేయలేదు. కానీ అదనంగా అప్పులు తీసుకోవాలనుకొన్న రాష్ట్రాలే స్వచ్ఛందంగా మీటర్లు బిగింపజేశాయి. కనుక మీరేదో రైతులను ఉద్దరిస్తున్నట్లు మాట్లాడటం సరికాదు,” అని ఘాటుగా జవాబిచ్చారు.

తెలంగాణ శాసనసభలో ఇంత అర్దవంతమైన చర్చలు జరుగుతుంటే, ఏపీ శాసనసభ సమావేశాలలో మనోళ్ళు ఎంతసేపు జగన్‌ భజన లేదా ప్రతిపక్ష సభ్యులను అవహేళన చేస్తూ సమస్యలపై చర్చలు, జవాబులు దాటవేసి తప్పించుకొంటారు. చివరికి ఏపీ, తెలంగాణ శాసనసభ సమావేశాలలో కూడా ఇంత తేడా ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories