అన్ని దేశాలు, రాష్ట్రాలలో నేరాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని ముందుగా అడ్డుకోలేకపోయినప్పటికీ, నేరం జరిగిన తరువాత పోలీసులు తక్షణం స్పందించి నేరస్తులను పట్టుకొని వారికి కటిన శిక్షలు పడేలాచేయాలి. ఒకవేళ వారు అలసత్వం ప్రదర్శిస్తే వారిపై చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. కానీ ఓ నేరం జరిగినప్పుడు ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి పోరాడేవరకు ప్రభుత్వం, పోలీసులు మేల్కొనకపోవడం, మేల్కొన్న తరువాత నిందితులపై చర్యలు చేపట్టే బదులు, తమను నిలదీసి అడిగినందుకు ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం, వారిపై కేసులు బనాయించడం సర్వసాధారణ విషయమైందిప్పుడు.
విజయవాడ, గుంటూరు అత్యాచారం కేసుల తరువాత జరిగిన పరిణామాలు, కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుకు ముందు జరిగిన పరిణామాలు, అమలాపురం అల్లర్ల తరువాత జరిగిన పరిణామాలు తాజా ఉదాహరణలుగా కనబడుతున్నాయి.
హైదరాబాద్‌లో మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే విదంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్, బిజెపిలు ఆరోపిస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీకి చెందిన నేతల కుమారులు ఈ హేయమైన నేరానికి పాల్పడటం, ఈ కేసులో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ మనుమడు కూడా ఉన్నాడని బిజెపి నేతలు ఆరోపిస్తుండటం, నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలంటూ కాంగ్రెస్, బిజెపిలు ఆందోళనలు చేస్తుండటం టిఆర్ఎస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
నేరం చేసినవారు ఎంత పెద్ద కుటుంబానికి చెందినవారైనా విడిచిపెట్టేది లేదని చెపుతూనే, వారిని కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్, బిజెపిలు ఆరోపిస్తున్నాయి. అయితే పోలీసులకు కూడా చిక్కని నిందితుల ఫోటో, వీడియో సాక్ష్యాధారాలను బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాకు చూపించి, వారికి అందజేయడంతో పోలీసులు షాక్ అయ్యారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ బాధితురాలు, మైనర్ నిందితుల ఫోటో, వీడియోలను బహిరంగంగా ప్రదర్శించి, మీడియాకు విడుదల చేసినందుకు ఆయనపై అబీడ్స్ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 228 (ఏ) కింద పోలీసులు నిన్న ఓ కేసు నమోదు చేశారు.
నిందితులను అరెస్ట్ చేయడానికి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు చెపుతున్నందునే వాటిని అందజేస్తే ఇప్పుడు పోలీసులు తనపైనే కేసు నమోదు చేయడం ఏమిటని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి ఈ కేసును పక్కదారి పట్టించడానికే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు.



