తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి అసలు కంగారు పెడుతున్నదెవరు? కంగారు పడుతున్నదెవరు? అంటూ తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు. ఎర్రవల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తెరాస ముఖ్య నాయకులతో., అందుబాటులో ఉన్న మంత్రులతో., ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సహా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
నిన్న మొన్నటి దాకా ఫామ్ హౌస్ నుండి బయటకు రాని కేసీఆర్ తీరు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాస్తంత విస్మయానికి గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలం పుంజుకుంటున్న నేపథ్యంలో., ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే ఈ అత్యవసర భేటీ జరిగిందా? లేక ముందస్తు ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన రాజకీయంలో మంత్రులు., నాయకులు అనుసరించాల్సిన విధానాలను గురించి దిశా – నిర్దేశం చేసే ఉద్దేశంలో ఏర్పడిన భేటీనా? అంటూ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి మరీ అధికార పార్టీకి తామే ప్రత్యర్థులం అనే చందంగా మారిపోయింది బీజేపీ రాజకీయం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటూ ఏదొక విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ, తెరాస ముఖ్యనేతలలో ఒకరైన ఈటెలను తమ పార్టీలో కి ఆహ్వానించి., అతని గెలుపుని, ఇప్పుడు ఎన్నికల ప్రాతిపదికగా ప్రజలకు చూపిస్తూ ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను మీడియా సమావేశాల దాకా తీసుకువచ్చిన ఘనత బీజేపీకే దక్కింది.
అసెంబ్లీలో కేసీఆర్ నిరుద్యోగుల మీద కురిపించిన వరాల జల్లుతో మొదలైంది బీజేపీ విజయం అంటూ మాట్లాడుతూ… ఇది ఇక్కడితో ఆగిపోదని కేసీఆర్ ను గద్దె దింపే వరకు తెలంగాణాలో తమ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని., కేసీఆర్ నిన్ను వదలా అంటూ బీజేపీ పార్టీ తెరాసను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ హడావిడి చూస్తేనే అర్ధమవుతోంది కంగారు పడుతుందేవరో., కంగారు పెడుతోందెవరో.! అంటూ పొలిటికల్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.