సిఎం కేసీఆర్ దూరదృష్టికి ఇదే నిదర్శనం?

Telangana_CM_K_Chandrashekar_Raoతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి సుమారు వారం రోజుల పాటు దేశంలో వివిధ రాష్ట్రాలలో పర్యటించేందుకు బయలుదేరుతున్నారు. ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తానని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతానని చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పారు.

ఇప్పుడు దాని కోసం సన్నాహాలు ప్రారంభించినట్లున్నారు. అయితే ఈ పర్యటనకు చాలా ప్రత్యేకమైనది. సిఎం కేసీఆర్ రాజకీయ జీవితంలో చాలా కీలకమైనది కూడా. గతంలో ఆయన వివిధ రాష్ట్రాలలో పర్యటించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా విపక్ష పార్టీల నేతలను మాత్రమే కలుసుకొని ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించేవారు. కానీ ఈసారి పర్యటనలో సిఎం కేసీఆర్ పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులను కలవనున్నారు.

ADVERTISEMENT

సిఎం కేసీఆర్ వంటి రాజకీయ ప్రముఖుడికి దేశంలో జాతీయస్థాయి రాజకీయనేతలతో పరిచయాలు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయన ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, విపక్ష నేతలతో సమావేశమై కూటమి ఏర్పాటు గురించి చర్చించారు.

అయితే జాతీయస్థాయి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాలంటే దేశంలో అన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా… ఉత్తరాది రాష్ట్రాలలో ప్రజలచేత గుర్తింపు పొందడం చాలా అవసరం. ప్రజల గుర్తింపు, ఆదరణ లేకుంటే ఎంతటి వారైనప్పటికీ జాతీయస్థాయి నాయకుడిగా రాణించలేరనే సత్యం సిఎం కేసీఆర్ ముందే గ్రహించారు.

అందుకే సిఎం కేసీఆర్ ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు చండీగఢ్‌లో పర్యటించి, ధిల్లీ రైతు ఉద్యమాలలో మరణించిన 600 మంది రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3,00,000 చొప్పున ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందజేయబోతున్నారు. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో కూడా పర్యటించి గాల్వాన్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించి వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేయబోతున్నారు.

ఈ విధంగా జాతీయ రాజకీయాలలో ప్రవేశించే ముందే ఉత్తరాది రాష్ట్రాలలో ప్రజలతో మంచి గుర్తింపు, గౌరవం పొందాలనే ఆలోచన సీఎం కేసీఆర్ దూరదృష్టికి చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఒక వైపు ఆయా రాష్ట్రాలలో ప్రజల గుర్తింపు పొందేందుకు ప్రయత్నాలు చేస్తూనే, మళ్ళీ ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు తనకు అడ్డుపడకుండా ఉండేందుకు వాటిని కూడా కలుపుకొని పోవాలనుకోవడం సిఎం కేసీఆర్ రాజనీతిజ్ఞత, దూరదృష్టికి మరో చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

చండీగఢ్‌లో చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదే పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సమక్షంలో నిర్వహిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు… సిఎం కేసీఆర్ ఎంచుకుంటున్న వారదందరూ కూడా తనలాగే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించేవారే కావడం ఆయన రాజనీతిజ్ఞకు మరో నిదర్శనం. లేకుంటే ఆయన మొట్టమొదట పక్కనే ఉన్న మన రాష్ట్రానికే వచ్చి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యుండేవారు.

సిఎం కేసీఆర్ ఇప్పుడు దేశాటనకు బయలుదేరడానికి మరో ముఖ్యమైన కారణం కూడా కనిపిస్తోంది. సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తే ఆయన కుమారుడు రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారని అందరికి తెలుసు. దీనినే మరో విధంగా చెప్పాలంటే, సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ కోసం తన పదవిని త్యాగం చేసి జాతీయ రాజకీయాలలోకి వెళ్ళేందుకు సిద్దపడుతున్నారనుకోవచ్చు.

సీఎం కేసీఆర్ దీనికి కూడా ముందే ముహూర్తం ఖరారు చేసుకొన్నట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది దసరా నాటికి ఎట్టి పరిస్థితుల్లో కొత్త సచివాలయం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించాలని గడువు విధించారు. కనక దసరానాడు కొత్త సచివాలయం ప్రారంభించగానే లేదా అంతకంటే ముందు తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని, కేటీఆర్‌కు ఆ బాధ్యతలు, కొత్త సచివాలయాన్ని అప్పజెప్పి తాను దిల్లీకి షిఫ్ట్ కావచ్చు.

ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఆ పదవి నుంచి తప్పుకొని రాష్ట్రంలో అంతకంటే తక్కువ స్థాయి పదవిలో పనిచేయడం సమంజసంగా ఉండదు. కనక ఈ లోపుగా జాతీయస్థాయి రాజకీయాల్లో ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటే, దసరానాడు కేటీఆర్‌ ముఖ్యమంత్రిగా కొత్త సచివాలయంలో అడుగు పెట్టించి తాను ధిల్లీకి బయలుదేరవచ్చు.

అప్పటికే కేసీఆర్ కొంత గ్రౌండ్ వర్క్ పూర్తిచేసి ఉంటారు కనుక జాతీయరాజకీయాలలో చాలా సులువుగా ఇమిడి పోగలుగుతారు. ఈ వాదనలు నిజమా కాదా అనేది రాబోయే ఆరేడు నెలల్లో స్పష్టమవుతోంది. కనుక నేటి నుంచి సీఎం కేసీఆర్ చేస్తున్న దేశాటన చాలా కీలకమైనదిగా భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories