లోక్‌సభ ఎన్నికలలో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. మే 20,25, జూన్ 1వ తేదీలలో మిగిలిన మూడు దశల ఎన్నికలు కూడా పూర్తవుతాయి. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. కనుక ఈసారి బీజేపీ, ఇండియా కూటమిలో ఏది గెలిచి అధికారంలోకి వస్తుంది?అని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.
ఈసారి బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినప్పటికీ 300కి పైగా సీట్లు గెలుచుకుని మళ్ళీ అధికారంలోకి రావచ్చని సర్వేలు సూచిస్తున్నాయి.
కానీ ఈసారి బీజేపీకి 200-220 కంటే ఎక్కువ సీట్లు రావని, ఇండియా కూటమి అడ్రస్ లేకుండా పోతుందని కేసీఆర్ జోస్యం చెపుతున్నారు. అప్పుడు బిఆర్ఎస్, వైసీపి, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకె వంటి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని కేసీఆర్ జోస్యం చెప్పారు.
కానీ వాటికీ ప్రభుత్వ ఏర్పాటుకి తగినన్ని ఎంపీలు ఉండరని, కనుక కాంగ్రెస్ లేదా బీజేపీలు తమ కూటమికి మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించక తప్పదని కేసీఆర్ జోస్యం చెప్పారు. అవకాశం ఉంటే ప్రధాని పదవికి తాను కూడా పోటీ పడతానని కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ చిలక జోస్యం తెలంగాణలో తన సొంత పార్టీకే ఫలించలేదు. ఇక జాతీయ స్థాయిలో ఫలిస్తుందా?అంటే అనుమానమే. బహుశః తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకొని పార్టీని కాపాడుకోవడం కోసమే ఎప్పటిలా ఈవిదంగా చిలక జోస్యం చెప్పి, ఢిల్లీలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలుకుతున్నారేమో… జూన్ 4 తర్వాత తెలుస్తుంది.
కానీ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా ఈసారి బీజేపీకి 200-220కి మించి ఎంపీ సీట్లు రావని, ఆ సీట్లతో అది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 125 ఎంపీ సీట్లు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని రేవంత్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఆయన ఓ బలమైన కారణం చెప్పారు.
పదేళ్ళ మోడీ పాలనతో విసుగెత్తిపోయిన దేశ ప్రజలు బీజేపీకి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికే ఓట్లు వేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 330 స్థానాలలో పోటీ చేసింది. కానీ వాటిలో 125 స్థానాలు గెలుచుకున్నా, బయట పార్టీలు మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకి సహకరిస్తాయని చెప్పారు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దేశంలో అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి కానీ బీజేపీకి లేవు. ఒకవేళ ఉన్నా ఏ పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చి దానితో కలిసి కేంద్రప్రభుత్వం ఏర్పాటుకి ముందుకు రావు. కనుక ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అని తాజా ఇంటర్వూలో చెప్పారు. రేవంత్ రెడ్డి వాదన సహేతుకంగానే ఉంది కానీ బీజేపీ తనంతట తానుగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్, ఇండియా కూటమి కనీసం 200-220 సీట్లు కలిగి ఉంటేనే ఇది ఆచరణ సాధ్యం. ఇంతకీ కేసీఆర్, జగన్ ఇద్దరూ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎటువైపు మొగ్గుతారో చూడాలి.




