
రెండు లేక మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ సందర్భంగా ఆయా పార్టీల నాయకుల మధ్య పదవుల పంచాయితీలు మొదలవుతాయి, అలాగే వాటిని తీర్చడానికి, తమ పార్టీ నాయకులను సంతృప్తి పరచడానికి ఆ పార్టీ అధినేతలు ఒక్కో సందర్భంలో తలలు కూడా పట్టుకుంటారు.
కానీ కాంగ్రెస్ పార్టీ పదవుల పంచాయితీకి ఈ కారణాలేమీ అవసరం ఉండదు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే సిపిఐ, సిపిఎం లతో పొత్తు ఉన్నప్పటికీ అది కేవలం నామమాత్రపు పొత్తుగానే పరిగణించవచ్చు.
Also Read – అహంతో కేసీఆర్, జగన్, ఆహాన్ని జయించిన బాబు
అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి వర్గ విస్తరణ అంటే అదొక పెద్ద పంచాయితీనే అవుతుంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా అధిష్టానం పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టలేకపోతుంది.
దీనికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మితిమీరిన ప్రజాస్వామ్యమే అనేది బహిరంగ సత్యమే, అయినప్పటికీ ప్రభుత్వానికి మంత్రి వర్గ విస్తరణ అనేది అనివార్యమైనా కార్యం. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, అక్కడ పార్టీ అధిష్టానంతో చర్చోపచర్చలు జరపడం, అటు పిమ్మట మంత్రి వర్గ విస్తరణకు మరికాస్త సమయం కావాలంటూ రేవంత్ ఖాళీ చేతులతో రావడం గత ఏడాదినర్రగా ఆనవాయితీగా మారిపోయింది.
Also Read – ఈ ఒక్క ప్రెస్‌మీట్ చాలదూ.. ఏపీ భవిష్యత్ తెలుసుకోవడానికి!
అయితే కాంగ్రెస్ పార్టీలో పదవుల కన్నా నాయకులే ఎక్కువ. పార్టీలో ప్రతి సీనియర్ నాయకుడు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అనే భావనలో ఉంటారు, అలాగే ఒక్కో నాయకుడు ఒక్కో మంత్రి స్థానాన్ని ఆశిస్తూ ఉంటారు. పార్టీ గెలుపు బాధ్యతను తీసుకోలేని నేతలు సైతం ప్రభుత్వ పదవులను ఆశిస్తూ రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి పార్టీ అధిష్టాన నాయకత్వం వరకు బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం కాంగ్రెస్ లో పరిపాటిగా మారిపోయింది.
ఈ సందర్భంలో రేవంత్ ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో ఆశావహులకు ఉపిరిపోసినట్టయ్యింది. ఇప్పటికే రేవంత్ కేసీ వేణు గోపాల్ తో ఈ అంశాల పై ఓ సారి కలిసి చర్చించారు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు, క్యాబినెట్ విస్తరణ పై అధిష్టానం నుంచి స్ఫష్టమైన ఆదేశాలను తీసుకుని వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలనీ రేవంత్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
Also Read – మోడీ ఆలోచనలు.. చంద్రబాబు ఆవిష్కరణ.. శభాష్!
మరి ఈ చర్చలతో అయినా ఈసారి రేవంత్ క్యాబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా చూడాలి. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం ఆశగా, ఆత్రంగా ఎదురుచూస్తున్న నాయకులు మాత్రం అధిష్టానం ప్రకటించబోయే లిస్ట్ లో తమ పేరు లేకుంటే ఆ అక్కసు మొత్తాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చూపేందుకు సిద్దమవ్వడం ఖాయమే అవుతుందేమో. ఇక్కడ నేతలను మెప్పిస్తూనే అక్కడి అధిష్టాన్ని ఒప్పించగల రాజకీయ చాణిక్యాన్ని రేవంత్ ప్రదర్శించగలడా అన్నది కూడా ఆసక్తిగా మారింది.