ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో తెలీని పరిస్థితి. కానీ తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో పోటాపోటీగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేసినా, నాలుగు చినుకులు పడగానే పచ్చగడ్డి చిగురించిన్నట్లు, మళ్ళీ ఎన్నికలొచ్చేసరికి కేసీఆర్‌ని ఢీకొనడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది.
కేంద్రం అండదండలున్న బీజేపీని తట్టుకోలేక కేసీఆరే కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపి ఈ స్థాయికి తెచ్చారని, కాంగ్రెస్‌లో కొంతమంది అభ్యర్ధులకు కేసీఆరే నిధులు సమకూర్చుతున్నారని, వారు ఎన్నికలలో గెలిచిన తర్వాత కేసీఆర్ చిటిక వేయగానే బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. వాటిలో నిజానిజాలను పక్కన పెట్టి చూస్తే, కాంగ్రెస్ పార్టీ పుంజుకొందని బీజేపీ కూడా అంగీకరించిన్నట్లు అర్దమవుతోంది.
కనుకనే పలువురు బిఆర్ఎస్ నేతలు బీజేపీని కాదని కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని ఈ చేరికలు సూచిస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడే ఆ పార్టీ నేతలు పదవుల కోసం కీచులాడుకొనేవారు. ఇప్పుడు అధికారంలోకి వస్తుంటే ఊరుకొంటారా? ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి కుర్చీలో రుమాలు వేయడం ప్రారంభించారు.
ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ కాంగ్రెస్‌ను ఈ స్థాయికి తెచ్చింది రేవంత్ రెడ్డే కనుక మొట్ట మొదటి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆయనే అవుతారు. ఆయన కాక పార్టీలో ఇంకా భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్, మధూ యాష్కీ వంటి అరడజను మంది ఈ రేసులో ఉన్నారు.
కె జానారెడ్డి కూడా ఈ రేసులో చేరి, తానే ముఖ్యమంత్రి కాబోతున్నానని నిన్ననే ప్రకటించారు. పదవుల కోసం తానెన్నడూ ఆరాటపడలేదని, పదవులే తన వెంటపడ్డాయని, కనుక ముఖ్యమంత్రి పదవి కూడా అలాగే తనకు దక్కబోతోందని తేల్చి చెప్పేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెంటనే అధిష్టానం తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం, ఆరు నెలల్లోగా తన కుమారుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ స్థానం నుంచి తాను పోటీ చేయడం చకచకా జరిగిపోతాయని జానారెడ్డి నిన్ననే చెప్పారు. అసలు ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో తెలీదు. కాంగ్రెస్‌ను గెలిపించుకొనేందుకు జానారెడ్డి ఏమి ప్రయత్నాలు చేస్తున్నారో తెలీదు. కానీ గెలిస్తే నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమవుతారు?కుర్చీలో రుమాలు వేసిన మిగిలిన అరడజను మంది ఏమవుతారో?






