ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మికశాఖ అధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆంధ్రా రాజకీయాలు, ప్రభుత్వంపై నిశితంగా విమర్శలు గుప్పించారు.
“ఏపీలో ఎల్లప్పుడూ కులరాజకీయాలే నడుస్తుంటాయి. ఒక్కోపార్టీ ఒక్కో కులం పేరుతో ప్రజలను వంచిస్తూనే ఉంటుంది తప్ప దేనికీ ప్రజల బాగోగులు పట్టవు. అందుకే ఉద్యోగాలు, ఉపాధి, ఉన్నత చదువుల కోసం ఆంధ్రా నుంచి లక్షలాది మంది మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. మన ఎంసెట్ పరీక్షలకు మొత్తం మూడు లక్షలమంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా వారిలో 95 వేలమంది ఆంధ్రాకు చెందినవారే ఉన్నారు. అంతమంది ఇక్కడే ఎందుకు చదువుకోవాలనుకొంటున్నారంటే, తెలంగాణలో అత్యుత్తమ విద్యాప్రమాణాలు కలిగిన ఉన్నత విద్యాసంస్థలున్నాయి కనుకనే.
మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మహారాష్ట్రలో ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరధం పడుతున్నారు. రేపు ఆంద్రా శాసనసభ ఎన్నికలలో కూడా మన బిఆర్ఎస్ పార్టీయే గెలిచి అధికారంలో రాబోతోంది. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి వేలకోట్లు నిధులు అందిస్తోంది. అయినా ఆంధ్రా పాలకులు దానిని కట్టుకోలేకపోతున్నారు. కానీ మన కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం పైసా ఇవ్వకపోయినా ప్రపంచమే అబ్బురపడేలా మూడున్నరేళ్ళలో నిర్మించి చూపాము. కనుక ఏపీలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుని మనమే పూర్తిచేస్తాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని మనమే కాపాడుతాము,” అని అన్నారు.
ఏపీలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం మాట అటుంచితే, ఏపీ రాజకీయ పార్టీల తీరు, పోలవరం ప్రాజెక్టు గురించి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్న మాటలు అక్షరాల నిజమని అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం ఏకంగా అమరావతి మీదే కులం ముద్రవేసి దానిని పూర్తిచేసే బాధ్యత నుంచి తెలివిగా తప్పించుకొని మూడు రాజధానులంటూ కాలక్షేపం చేసేస్తోంది.
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మొదటి సంవత్సరంలోనే చెప్పేశారు. అయితే అది పూర్తవకపోవడానికి కారణం తమ అసమర్దత, వైఫల్యమని చెప్పుకోలేక దానికీ గత ప్రభుత్వ వైఫల్యాలే కారణమని ఆరోపించి చేతులు దులుపుకొన్నారు.
ఆయనతో సహా కొంతమంది మంత్రులు ఎల్లప్పుడూ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ఆడిపోసుకోవడమే డ్యూటీ అన్నట్లు చాలా లేకిగా మాట్లాడుతుంటారు. ఓట్ల కోసం సంక్షేమ పధకాలు, పధకాల కోసమే అప్పులు, ఆ అప్పుల భారం తగ్గించుకోవడానికే పన్నులు, ఛార్జీల పెంపు… దాని నుంచి ఉపశమనం కలిగిస్తున్నట్లు మళ్ళీ సంక్షేమ పధకాలు… ఈ చట్రంలో అభివృద్ధి ఊసేలేకుండా నాలుగేళ్ళుగా వైసీపీ పాలన సాగిపోతోంది. అందుకే తెలంగాణ మంత్రులు ఆంధ్రాను ఉద్దేశ్యించి ఇంత చులకనగా మాట్లాడగలుగుతున్నారు. అయినా మన బంగారం మంచికాకపోతే కంసాలిని నిందిస్తే ఏం లాభం?



