రాజకీయాలకు కాదేదీ అనర్హమని అన్ని పార్టీలు భావిస్తున్నందున ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా వెంటనే దానిపై రాజకీయాలు మొదలైపోతున్నాయి.

Also Read – అయ్యో పాపం.. టీడీపీ కార్యకర్తలు!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయుధంగా ఉపయోగించుకున్న అస్త్రాలే అధికారంలోకి వచ్చాక గుచ్చుకొని బాధపెడుతుంటాయి.

శ్రీశైలం ఎడమ కాలువ నుంచి నల్గొండ జిల్లాకు సొరంగ మార్గం ద్వారా సాగు, తాగునీటిని తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లాలో దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ చేపట్టింది. బారీ టన్నల్ బోరింగ్ మెషిన్‌తో సుమారు 54 కిమీ మేర కొండని తొలిచి సొరంగం నిర్మిస్తున్నారు.

Also Read – హాజరు కోసమే కేసీఆర్‌ వచ్చారట!

శుక్రవారం ఉదయం సొరంగంలో 14వ కిమీ వద్ద నీరు ఉబికి వచ్చి పైకప్పు కూలిపోయింది. లోపల పనిచేస్తున్న 40 మందిలో 32 మంది తృటిలో తప్పించుకొని బయటపడ్డారు. కానీ మిగిలిన 8 మంది లోపల చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రధాని మోడీ స్వయంగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నామని, అవసరమైతే ఆర్మీ ఇంజనీర్లు, సిబ్బందిని పంపిస్తామని చెప్పారు.

Also Read – జగన్‌, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!

ఇది ప్రమాదమని అర్దమవుతున్నా బిఆర్ఎస్ పార్టీ దీనిపై రాజకీయాలు మొదలుపెట్టేసింది. సిఎం రేవంత్ రెడ్డి అసమర్దత, అవినీతి వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కనుక రేవంత్ రెడ్డి, మంత్రులు దీనికి నైతిక బాధ్యత వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే పలు సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సొరంగ ప్రమాదం తలనొప్పిగా మారింది. లోపల చిక్కుకున్న 8మంది ప్రాణాలు కాపాడటం ప్రభుత్వం తొలి ప్రాధాన్యత కాగా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తోంది. లేకుంటే అదే నిజమని ప్రజలు నమ్మితే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుంది.

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవకతవకలు, అవినీతి గురించి నిలదీస్తుండేది. కానీ అప్పుడు కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాశిస్తుండేవారు.. పైగా గట్టిగా డబ్బా కొట్టించుకునేవారు కనుక కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలు వాటిలో కొట్టుకుపోయేవి.




కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత బలంగా లేదు. కనుక ఈ సమస్య రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.. కనుక ధీటుగా ఎదుర్కోక తప్పదు.