రేవంత్ గెలిపించినా యూరియా ఓడిస్తుందా?

Telangana’s Urea Shortage: Farmers Struggle, Politics Heat Up

ఒక్కోసారి ఉల్లిపాయలు, టమేటా వంటి కూరగాయల ధరలు పెరిగినా ఎన్నికల ఫలితాలు తారుమారు అయిపోతాయి. కనుక ప్రభుత్వాలు వాటిని కూడా విస్మరించకూడదు. కానీ అలవాటులో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పగలు, రాత్రి, ఎండా వాన అని చూడకుండా రోజుల తరబడి గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఓ పక్క భారీ వర్షాలు పడుతున్నా గొడుగులు వేసుకొని మరీ క్యూలైన్లలో నించుంటున్నారు. వారికి ఈ దుస్థితి కలిగినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టుకోకుండా ఉండరు.

ADVERTISEMENT

ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న బీఆర్ఎస్‌ పార్టీ యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాల గురించి సోషల్ మీడియాలో, సొంత మీడియాలో ఫోటోలు, వీడియోలు పెట్టి మరీ కధలు కధలుగా వర్ణిస్తోంది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శిస్తోంది.

కానీ కేంద్రం యూరియా సరఫరా చేయకపోతే తాము ఎక్కడి నుంచి తెతేలమంటూ కాంగ్రెస్‌ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. యూరియా కోసం తాము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నామని, కానీ మోడీ ప్రభుత్వం యూరియా ఇవ్వకుండా తెలంగాణపై వివక్ష చూపుతోందని కాంగ్రెస్‌ మంత్రులు వాదిస్తున్నారు.

ఈ వాదోపవాదాలతో తెలంగాణ రైతాంగానికి పనిలేదు. వారికి కావలసిందల్లా యూరియా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది ఇవ్వలేనప్పుడు వారు ఈవిషయం తప్పకుండా మనసులో పెట్టుకుంటారు. ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు… అని బీజేపికి తెలుసు… కనుకనే యూరియా సరఫరా ఆలస్యం చేస్తోందేమోనని కొందరు కాంగ్రెస్‌ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు కలిపి యూరియా విషయంలో తమ ప్రభుత్వంతో మైండ్ గేమ్స్ ఆడుతున్నట్లున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వారి అనుమానాలు నిజమై ఉండొచ్చు కాకపోవచ్చు కానీ యూరియా కొరత ఇలాగే కొనసాగితే అంతిమంగా నష్టపోయేది కాంగ్రెస్‌ పార్టీయే.

ADVERTISEMENT
Latest Stories