టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఉత్తర, దక్షిణ కొరియాలతో పోల్చారు. “రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఏపీ అభివృద్ధిపధంలో ముందుకు సాగింది. ముఖ్యంగా ఆర్ధికవృద్ధి విషయంలో ముందడుగు వేసింది. కానీ నాలుగేళ్ళ వైసీపీ అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయింది.
హైదరాబాద్‌ని ఉపయోగించుకొని తెలంగాణ దక్షిణ కొరియాలా అభివృద్ధి చెందితే, వైసీపీ విధ్వంస పాలనతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉత్తర కొరియాలా మారింది.
నాలుగేళ్ళ జగన్ పాలనలో రాష్ట్ర విభజనకు మించిన విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నేతల దౌర్జన్యాలు, భూకబ్జాలు, ఇసుక, మట్టి మాఫియాలు, గంజాయి, మద్యం మాఫియాలే కనిపిస్తున్నాయి. జగన్ పగ, ప్రతీకారాలతో రగిలిపోతూ అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పక్కన పడేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదు. ఈ దుష్ట పాలనకు అంతం ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి వైసీపీని సాగనంపడం తధ్యం,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు నాయుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఉత్తర, దక్షిణ కొరియాలతో పోల్చడం ఆంధ్ర ప్రజలకు చాలా బాధ కలిగించవచ్చు కానీ ఆయన చెప్పింది చేదు వాస్తవమని అందరికీ తెలుసు. ఉత్తర,దక్షిణ కొరియాలు విడిపోయిన తర్వాత రెండు దేశాలు పూర్తి విభిన్నమైన విధానాలతో ముందుకు సాగాయి. దక్షిణ కొరియా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగగా, ఉత్తర కొరియా నియంతల పాలనలో మిలటరీ రాజ్యంగా మారింది. ఉత్తర కొరియాలో నెలకొన్న పరిస్థితులకు బయపడి ఆ దేశం ప్రజలు దక్షిణ కొరియా లేదా పొరుగు దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగులు కూడా అదే చేస్తున్నారుగా?
రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర గందరగోళ పరిస్థితులలో నిలిచిన ఏపీని చంద్రబాబు నాయుడు మళ్ళీ గాడిన పెట్టి, అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలతో అభివృద్ధి పదంలో నడిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని యదాతధంగా కొనసాగించి ఉండి ఉంటే నేడు ఏపీ దేశంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం ఉత్తర కొరియా విధ్వంస విధానాలను అనుసరించడంతో ఏపీలో ఉద్యోగులకు నెలనెలా జీతాలు కూడా ఇవ్వలేని దయనీయస్థితికి చేరుకొంది.
తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుని తీవ్రంగా ద్వేషిస్తున్నప్పటికీ, ఆయన తన పగలు, ప్రతీకారాలు రాజకీయాలకే పరిమితం చేసుకొని, చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అభివృద్ధిపనులకు మరింత మెరుగులు దిద్దుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్: 1 రాష్ట్రంగా నిలిపారు.
అంటే పాలకులకు సరైన ఆలోచన, దూరదృష్టి, విధానాలు చాలా అవసరమని స్పష్టమవుతోంది. ఉంటే తెలంగాణ, దక్షిణ కొరియాల్లా అభివృద్ధి చెందుతాయి. లేకుంటే ఏపీ, ఉత్తర కొరియాల్లా పతనావస్థకు చేరుకొంటాయన్న చంద్రబాబు నాయుడు అభిప్రాయం నూటికి నూరు శాతం నిజమే కదా? ముంజేతి కంకణం చూసుకొనేందుకు అద్దం ఎందుకన్నట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కళ్లెదుటే ఉన్నాయి కదా?



