‘టైమ్స్ నౌ’ తాజా సర్వేలో కేంద్రంలో మళ్ళీ ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పింది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకు ఎన్డీయే కూటమి 307 సీట్లు గెలుచుకోబోతోందని, ఇండియా కూటమి 175 సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పింది.
లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్: 9-11, బీజేపీ: 2-3, కాంగ్రెస్: 3-4 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఏపీలో వైసీపి 25 స్థానాలకు 24 గెలుచుకోబోతోందని టైమ్స్ నో జోస్యం చెప్పింది.
టైమ్స్ నౌ వంటి జాతీయ మీడియా సంస్థలకు ఉత్తరాది రాష్ట్రాల సమస్యలు, ఓటర్లు, వారి ఆలోచన తీరు గురించి మంచి అవగాహన ఉంటుంది కనుక జాతీయస్థాయిలో వాటి అంచనాలు ఫలితాలకు కాస్త దగ్గర దగ్గరగా ఉంటాయి.
కానీ వాటికి దక్షిణాది రాష్ట్రాలపై అంత లోతైన అవగాహన ఉండదు. కనుక స్థానిక ఏజన్సీల చేత సర్వే చేయించి నివేదికలు ప్రకటిస్తుంటాయి. తెలంగాణ విషయంలో వాటి అంచనాలు నిజం కావచ్చునేమో కానీ ఆంధ్రాలో దాని అంచనాలు వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు అరెస్టు వలన ప్రజలలో ఏర్పడిన సానుభూతి, టిడిపి, జనసేనల పొత్తుల ప్రభావం, వైసీపి నేతల అవినీతి, ప్రతిపక్షాలను వేధింపులు, ఇంకా రాజధాని, పోలవరం, అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, విద్యుత్ చార్జీల బాదుడు వంటి అంశాలను టైమ్స్ నౌ పరిగణనలోకి తీసుకొన్నట్లు కనబడదు.
వీటన్నిటితో పాటు సంక్షేమ పధకాలను కూడా పరిగణనలోకి తీసుకొని చూస్తే ఈసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వైసీపికి, టిడిపి కూటమికి మద్య తీవ్రమైన పోటీ ఉంటుందని అర్దమవుతుంది. ఈ కారణంగా రెంటికీ సరిసమానంగా లేదా టిడిపి కూటమికి కాస్త ఎక్కువ సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అయినా వైసీపి నిజంగానే 175/25 సీట్లు గెలుచుకొనే పరిస్థితులున్నట్లయితే జగన్ ప్రభుత్వం టిడిపిని దెబ్బతీయడానికి ఇంతగా ప్రయత్నించేది కాదు కదా?కానీ టిడిపిని లేకుండా చేసి ఎన్నికలకు వెళ్ళాలనుకొంటోంది. ఎందుకు?అంటే టిడిపి ఉంటే వైసీపి నష్టపోతుందని భావిస్తున్నట్లే కదా?
ఒకవేళ రాష్ట్రంలో టిడిపిని లేకుండా చేయడంలో వైసీపి ప్రభుత్వం సఫలమైతే అప్పుడు ప్రజలకు వేరే మార్గం ఉండదు కనుక వైసీపి 175/25 సీట్లతో గెలవగలదు. కానీ టిడిపిని లేకుండా చేయడం సాధ్యమేనా?మరి టైమ్స్ నౌ ఏవిదంగా 25కి 24 లోక్‌సభ సీట్లు వైసీపి గెలుచుకోగలదని చెపుతోంది?




